Published 27 Nov 2023
రైతుబంధు నిధుల(Rythubandhu Funds) విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటలు, ఫిర్యాదుల యుద్ధంతో రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు రెండ్రోజుల క్రితం CEC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలింగ్ కు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 28 లోపు రైతుబంధు నిధులు విడుదల చేయవచ్చంటూ ఈసీ తొలుత పర్మిషన్ ఇచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది. ఎన్నికల సంఘాన్ని ప్రధాన టార్గెట్ గా చేసుకున్న రేవంత్ రెడ్డి… BRSకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
CEC అనూహ్య నిర్ణయం
రైతుబంధు నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే CECకి ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని రిటర్న్ తీసుకుంది. నియమాలు ఉల్లంఘించారంటూ అనుమతి ఉపసంహరించుకుంటూ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అధికార BRS పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లుగానే భావించాల్సి వస్తున్నది. రైతుబంధు చెల్లింపుల విషయంలో CEC అనుమతి రాగానే ఇక ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు గాను శనివారం నుంచి సోమవారం వరకు సెలవు రోజులు కావడంతో చెల్లింపులపై ఆ మూడు రోజుల్లో కసరత్తు చేసింది. ఇక మంగళవారం నాడు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి రెడీ అయిన పరిస్థితుల్లో BRSకు ఈసీ షాక్ ఇచ్చింది.
మంత్రి కామెంట్సే దెబ్బతీశాయా…!
విపక్ష కాంగ్రెస్ విమర్శలకు దీటుగా స్పందించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. హస్తం పార్టీ నేతలపై ఈ విషయంలో తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. బహిరంగసభలు, ర్యాలీల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో దీన్ని CEC సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. అటు తమపైనే కాంగ్రెస్ విమర్శలు చేయడం, ఇటు హరీశ్ రావు వివాదాస్పదంగా మాట్లాడటంతో ఈసీ ఇరకాటంలో పడ్డట్లయింది. ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదంటూ పర్మిషన్ ఇచ్చినపుడే EC క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో లబ్ధి పొందేలా కామెంట్స్ చేయొద్దంటూ ముందే షరతు విధించినా మంత్రి హరీశ్ రావు తరచూ దీనిపై మాట్లాడటం నియమావళికి విరుద్ధం కాబట్టి అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నామంటూ ఈసీ తెలిపింది.