ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం(Election Commission) చర్యలు మొదలుపెట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల్ని తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలకు కీలకంగా నిలిచే వారందర్నీ కనికరం లేకుండా సాగనంపింది. శనివారం(ఈనెల 16) మధ్యాహ్నం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్(Model Code Of Conduct) అమలవుతుండగా.. ఎన్నికల తేదీల్ని ప్రకటించిన రెండు రోజుల్లోనే పెద్దయెత్తున ఉన్నతాధికారుల్ని బదిలీ చేసింది. ఓటింగ్ ను ప్రభావితం చేసే రీతిలో అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందన్న రిపోర్ట్ లతో ప్రధాన రాష్ట్రాల్లో పలువురిపై వేటు వేస్తూ EC నిర్ణయం తీసుకుంది.
ఆ అధికారులు వీరే…
ఎంతటి ఉన్నతాధికారైనా సరే CEC దృష్టిలో పడిందంటే ఇక అంతే సంగతులు. అలా పశ్చిమ్ బెంగాల్ డీజీపీ(DGP)నే కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శుల(Home Secretaries)ను పదవుల నుంచి తప్పించింది. ఇక ముంబయికి కీలకమైన బృహన్ ముంబయి కార్పొరేషన్(BMC)లోనూ పెద్దయెత్తున అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది. కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ సహా అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది.