
Published 20 Jan 2024
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కీలక నివేదికను న్యాయశాఖకు అందజేసింది. దేశంలో తరచూ ఎలక్షన్లు నిర్వహిస్తుండటంతో సమయం, డబ్బు వృథా అవుతూ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. జమిలి ఎన్నికలను తెరమీదకు తెచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సార్లు మధ్యలోనే ప్రభుత్వాలు కూలిపోవడంతో ప్రతి చోటా ఏటా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. ఎన్నికల నిర్వహణకు భారీ ఖర్చుతోపాటు సమయం వృథా కావడంపై ‘లా కమిషన్’ ఇప్పటికే ఎక్సర్ సైజ్ చేసి నివేదిక రూపొందించింది.
రిపోర్ట్ లోని అంశాలివే…
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ప్రతి 15 ఏళ్లకు రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తను తయారు చేసిన రిపోర్ట్ ను న్యాయశాఖకు పంపింది. EVMల జీవిత కాలం 15 సంవత్సరాలు కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని మార్చాల్సి ఉంటుందని తెలిపింది. ఒక సెట్ మిషిన్ ను మూడు దఫాలుగా మాత్రమే వినియోగించడానికి అనుకూలంగా ఉంటుంది. అతి త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమని గుర్తించింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నిర్వహించాల్సి వస్తే ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు సెట్ల చొప్పున మిషిన్లు అవసరమవుతాయి. ఒకటి లోక్ సభకు, ఇంకో సెట్ అసెంబ్లీకి ఏకకాలంలో వాడాలి. ఎన్నికలు సజావుగా సాగాలంటే కంట్రోల్ యూనిట్లు(CUs), బ్యాలెట్ యూనిట్లు(BUs), VVPAT(Voter-Verifiable Paper Audit Trial) యంత్రాలు రిజర్వ్ లో ఉంచాలని నివేదికలో వివరించింది.
Also Read ‘ఒకే దేశం –ఒకే ఎన్నికల’కు వేగంగా అడుగులు…
మూడు కలిపి యూనిట్…
బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, VVPATను కలిపి ఒక EVMగా పరిగణిస్తారు. ఈ లెక్కన ఏకకాలంలో ఎన్నికలకు 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్లు అవసరమని తెలిపింది. ఒక్కో BUకి రూ.7,900, CUకి రూ.9,800, వీవీప్యాట్ కి రూ.16,000 చొప్పున లెక్కేస్తే మొత్తంగా ఒక్కో యూనిట్ కు రూ.33,700 వ్యయమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పట్నుంచి ఏర్పాట్లు చేసుకున్నా 2029 నాటికే జమిలి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందని నివేదికలో స్పష్టం చేసింది. ఈవీఎంల స్టోరేజ్, భద్రతా బలగాల కేటాయింపు, అదనపు వెహికిల్స్ ను సమకూర్చడం వంటివి జరగాలి. ఈవీఎంలను తయారు చేసుకోవడం, ఇతర భద్రతా కారణాల రీత్యా ఈ ఎన్నికల్ని ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదని న్యాయశాఖకు పంపిన రిపోర్టులో తెలిపింది.
డిస్ క్వాలిఫికేషన్ కోసం సవరణలు…
ఒకే దేశం-ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356ను సవరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. దీనికితోడు ఎలక్షన్ల నాటికి పదవీకాలం మిగిలిపోయిన సభ్యుల డిస్ క్వాలిఫికేషన్ విషయానికి సంబంధించి పదో షెడ్యూల్ లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి(High Level) కమిటీ వేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నది.
Also Read: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలకు’ 8 మందితో కమిటీ