Published 27 Nov 2023
తెలంగాణ రాజకీయాలు కర్ణాటకను ఇరకాటంలో పెడుతున్నాయి. తెలంగాణ ప్రచారమంతా కర్ణాటక ప్రభుత్వాన్నే ఆసరాగా చేసుకోవడంతో BRS, BJP, కాంగ్రెస్ పార్టీలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. BRS, BJP విమర్శలను తిప్పికొట్టేలా తమ రాష్ట్ర డెవలప్మెంట్ పై తెలంగాణకు చెందిన మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు(Advertisements) ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కు లేఖ రాసిన CEC.. ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళి కిందకే వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై రేపు సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని సదరు లెటర్ లో తెలిపింది. దీనికితోడు ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
ఎందుకు చర్యలు తీసుకోకూడదన్న ఈసీ
తెలంగాణలో అడ్డగోలుగా ప్రకటనలు ఇస్తూ జనాల్ని అయోమయానికి గురిచేస్తున్నారంటూ అధికార BRS, విపక్ష BJP వేర్వేరుగా ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్స్ ఇచ్చాయి. అడ్వర్టయిజ్‌మెంట్స్ కోసం సిద్ధరామయ్య సర్కారు అనుమతి తీసుకోలేదని నిర్ధారణకు వచ్చిన ఈసీ.. BRS, BJP వాదన నిజమేనన్న నిర్ణయానికి వచ్చింది. మీడియా సంస్థలకు అడ్వర్టయిజ్‌మెంట్స్ ఇచ్చే విషయంలో కనీసం ఈసీని సంప్రదించాలన్న విషయం కూడా తెలియదా అని మండిపడ్డ కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలని పొరుగు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి రాసిన లెటర్ లో ప్రశ్నించింది.