
ఒకేసారి 20 మంది IAS, IPSలపై వేటు… శాఖల అధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలపై కొరడా.. కొత్త బాధ్యతలకు కేవలం IPSల లిస్టే పంపాలని ఆదేశం.. ఇదీ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే ముందు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు. 20 మంది ఉన్నతాధికారులపై వేటు వేస్తూ ఎన్నికల సంఘం(CEC) నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అందులో ముగ్గురు వివిధ శాఖల అధిపతులు, మరో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, 10 మంది SPలు ఉండటం ఆశ్చర్యకరంగా నిలిచింది. 20 మంది అధికారుల ట్రాన్స్ ఫర్స్ లో ఏడుగురు IASలు, మరో 13 మంది IPSలు ఉండటం బ్యూరోక్రాట్లలో కలకలం రేపింది. ఇలా ఇంతమందిని ఒకేసారి ఎన్నికల విధుల నుంచి తప్పించడం, అంతా ఉన్నతాధికారులే(Higher Officials) కావడమే అసలు టాపిక్. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు ఈ స్థాయిలో EC వేటు వేయలేదు. అయితే రాష్ట్రంలో బదిలీల వేటు ఇదే చివరిది కాదని కూడా ఎలక్షన్ కమిషన్ తీరును చూస్తే అర్థమవుతున్నది. రానున్న రోజుల్లో మరింతమంది ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం టాప్ లెవెలే కాదు కిందిస్థాయి సిబ్బందిపైనా కన్నేసి ఉంచింది.
ఎన్నికల సంఘమా… మజాకా…
‘ఎన్నికల సంఘం’ అంటే అంత ఈజీ కాదని చాలా మంది అధికారులకు తెలుసు. ఎన్నికల్లో పని చేయాలంటే పూర్తి పారదర్శకత(Transaperancy) అవసరం. అది ఉండాలంటే ఎంతో నిబద్ధత, తెగువ ఉండాలి. ఒక IASకు కలెక్టర్ పోస్టింగ్ అనేది రెండు నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. మిగతా సర్వీసంతా సబ్ కలెక్టర్, జేసీ, సెక్రటరీల స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇంచుమించు IPSలకు కూడా అదే పరిస్థితి. కానీ ఉద్యోగ జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కినా ‘కలెక్టర్, ఎస్పీ’గిరీ అనేది అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఆ రెండేళ్ల కాలమే కాదు.. అసలు కలెక్టర్లు, ఎస్పీలుగా పనిచేసే అవకాశమే రావడం లేదు చాలా మందికి. డైరెక్ట్ IAS, IPSల్లో స్ట్రిక్ట్ గా ఉండేవారు ‘లూప్ లైన్ల’కే పరిమితమవుతున్నారు. ఎంతోమంది నిబద్ధత గల అధికారులు ఉంటున్నా వారికి అవకాశాలు రాకపోవడంతో నిరాశే ఎదురవుతున్నది. దీంతో చాలా మంది రాజీ బాటనే ఎంచుకుంటుండగా, అందులో కొందరు మాత్రం నేతలకు దగ్గరై పోస్టింగ్ లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అలా తెచ్చుకున్న పోస్టింగ్ వల్ల మిగతా సర్వీసునంతా సదరు లీడర్ల కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తున్నది. ఇలాంటి రాజీ ధోరణి.. ‘స్ట్రిక్ట్’గా వ్యవహరించే అధికారులకు ఇబ్బందిగా మారింది.
ఒకసారి వేటుపడితే ఇక కష్టమే
ఎన్నికల డ్యూటీ అనేది ఒక ఛాలెంజింగ్ అయితే ఆ గౌరవం ఇచ్చే కిక్కే వేరు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నవారే ఈసీ దృష్టిలో ఉంటారు. అందుకే అలాంటి అధికారుల్నే ఎలక్షన్ డ్యూటీలకు పంపుతుంటారు. సరైన ట్రాక్ రికార్డ్ లేదని EC ఒకసారి గుర్తిస్తే అలాంటి వారి సేవల్ని ఇక ఏ ఎన్నికల్లోనూ వాడుకునే అవకాశం ఉండదు. అందుకే ఎలక్షన్లలో పనిచేయాలంటే చాలా మంది జంకుతుంటారు. నిబద్ధత గల అధికారులు మాత్రమే స్వేచ్ఛగా పనిచేసుకోగలుగుతారు. ఎన్నికల డ్యూటీ కత్తిమీద సామే అయినా ఎలక్షన్లలో పాల్గొనాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు. అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఈ విధులు సక్రమంగా సాగడానికి EC ఎంతవరకైనా వెళ్తుంది.. ఎంతటి సంచలన నిర్ణయాలైనా తీసుకుంటుంది. అందుకే ‘లూప్ లైన్ల’లో ఉండే అధికారులు ఎన్నికలప్పుడు ప్రత్యేకంగా తెరపైకి వస్తారు. కాబట్టి ఉద్యోగికి పనే కాదు.. సర్వీసు ట్రాక్ రికార్డు కూడా ముఖ్యమేనని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.