ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలతో హద్దు మీరుతున్న లీడర్లపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. వ్యక్తిగత ఆరోపణలతో కామెంట్స్ చేస్తే సహించేది లేదంటూ అన్ని పార్టీలకు వార్నింగ్ పంపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత(Top Leader) రాహుల్ గాంధీకి ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం(CEC)… తాజాగా మరో హెచ్చరికను పంపింది. ప్రజాసమూహాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని సలహా ఇచ్చింది. లేదంటే ఈ సారి కఠిన చర్యలు(Serious Action) తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
కేర్ ఫుల్ గా ఉండాల్సిందే…
ప్రచార సభల్లో నేతలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గత వారమే అన్ని పార్టీలకు ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. మోదీని ఇంటి పేరుతో విమర్శించడంపై గుజరాత్ BJP MLA పూర్ణేశ్ మోదీ.. సూరత్ సెషన్స్ కోర్టులో 2023 ఆగస్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బెయిల్ మంజూరు చేసి అప్పీల్ కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తే ఆ పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో శిక్ష విధించడం కరెక్టేనని, దీన్ని నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు లేవంటూ హైకోర్టు పేర్కొంది. దీనిపై రాహుల్ సుప్రీం మెట్లు ఎక్కారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయగా.. సుప్రీం ఆదేశాలతో తిరిగి పునరుద్ధరించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో…
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఎన్నికల సంఘాన్ని గత డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రధానిని ‘పనౌతి’, ‘పిక్ పాకెట్’ అంటూ రాహుల్ కామెంట్ చేశారు. దీనిపై ECకి వివరణ ఇచ్చిన రాహుల్ ను.. ఇకనైనా మాటలు జాగ్రత్తగా ఉండాలని EC స్పష్టం చేసింది.