తృణమూల్ కాంగ్రెస్ టాప్ లీడర్, TMCP(తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్) స్టేట్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. టీచర్ల రిక్రూట్ మెంట్ లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణంలో ఈడీ నోటీసులు పంపింది. అక్రమ లావాదేవీల నిర్వహణపై కొనసాగుతున్న విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ సమాచారం అందజేసింది. జూన్ 30న ఉదయం 11 గంటలకు కోల్ కతాలోని ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో పలువురిని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు… టీచర్స్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో మరింత మంది పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. స్కాంలో ఇప్పటికే అరెస్టయిన వ్యక్తితో సయోని ఘోష్ అనేక సార్లు ట్రాన్జాక్షన్స్ జరిపినట్లు గుర్తించారు. విచారణకు వచ్చేటప్పుడు కీలక పత్రాలుగా భావిస్తున్న వాటిని తీసుకురావాలని ఈడీ కోరింది.
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని 2022 జులైలో ఈడీ అరెస్టు చేయడం కలకలం రేపింది. ఆయన మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన నాయకుడు కావడంతో సంచలనంగా మారింది. మంత్రితోపాటు ఆయన సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ, పార్థాఛటర్జీ పర్సనల్ సెక్రటరీ సుకాంత ఆచార్య కూడా అరెస్టయ్యారు. ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన 2014-2021 మధ్య కాలంలో టీచర్ల రిక్రూట్ మెంట్ లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్పితా ముఖర్జీని అరెస్టు చేసిన సమయంలో ఆమె ఇంట్లో రూ.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ముఖ్య నేతకు ఈడీ సమన్లు జారీ చేయడంతో తృణమూల్ వర్గాల్లో కలకలం రేగుతోంది.