ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నేతల(Leaders) నుంచి వస్తున్న రెచ్చగొట్టే కామెంట్స్ ను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పార్టీల లీడర్లకు నోటీసులు ఇచ్చిన CEC… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం నోటీసులు పంపింది. ఆ ఇద్దరూ సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసుల్లో తెలిపింది.
విద్వేష కామెంట్స్…
రెండు ప్రధాన పార్టీలకు చెందిన మోదీ, రాహుల్ ఇద్దరూ ఎన్నికల కోడ్(Model Code Of Conduct) ఉల్లంఘించారని గుర్తించిన ఎలక్షన్ కమిషన్.. ఈ అగ్రనేతలకు నోటీసుల్ని జారీ చేసింది. ఈనెల 29న పొద్దున 11 గంటల లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ప్రసంగాల్లో ఓటర్లను రెచ్చగొట్టేలా మాటలున్నాయంటూ నోటీసుల్లో తెలియజేసింది. ఈ విషయంలో అభ్యర్థులతోపాటు స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలకు ఆయా పార్టీలే చూసుకోవాలని EC సూచించింది.
జరిగింది ఇదే…
మోదీ సర్కారు వల్లే దేశంలో పేదరికం పెరిగిందని, భాష, భౌగోళిక పరంగా ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల్ని వేరుగా చూస్తున్నదంటూ రాహుల్ మాట్లాడిన కామెంట్స్ పై BJP ఫిర్యాదు చేసింది. అటు దేశంలో వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ మాట్లాడారంటూ కాంగ్రెస్ సైతం ECకి కంప్లయింట్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచిపెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని విమర్శించారు. ఈ రెండింటిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఇద్దరు టాప్ లీడర్లకు నోటీసులు పంపింది.