ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు విడుదల కానుంది. 5 రాష్ట్రాల్లో జరగాల్సిన ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రకటిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇందుకోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాల్ని వెల్లడిస్తారని CEC తెలిపింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈవీఎంలు, భద్రత, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు కంప్లీట్ చేసింది. ఈ షెడ్యూల్ పై గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కమిషన్ విస్తృత సంప్రదింపులు జరిపింది.
రాష్ట్రాల వారీగా షెడ్యూల్
ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ల తీరు, పోలింగ్ ఎన్ని దశల్లో నిర్వహిస్తారన్న దానిపై ఈ రోజు క్లారిటీ రానుంది. 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచి ఓటు వేసేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ ఈసారి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ విధానం తొలిసారిగా ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ల నుంచి అమలులోకి రానుంది. తెలంగాణలో 119, మధ్యప్రదేశ్ 230, రాజస్థాన్ 200, ఛత్తీస్ గఢ్ 90, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
నేటినుంచే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమలులోకి వస్తుంది. ఇందుకోసం 5 రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపడతారు. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ(CS)లు, DGPలు, కేంద్ర పోలీసు బలగాల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సమావేశం నిర్వహించింది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చాక అనుసరించే విధివిధానాల(Guidelines)పై స్పష్టతనిచ్చిన దృష్ట్యా ఈ రోజు నుంచి ఎన్నికల కార్యకలాపాలు మొదలవబోతున్నాయి.
రాష్ట్రం… ముగిసే గడువు
మిజోరాం… డిసెంబరు 17, 2023
ఛత్తీస్ గఢ్… జనవరి 3, 2024
మధ్యప్రదేశ్… జనవరి 6, 2024
రాజస్థాన్… జనవరి 14, 2024
తెలంగాణ… జనవరి 16, 2024