హైకోర్టు తీర్పు దృష్ట్యా గద్వాల MLAగా డీకే అరుణను గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి దిశానిర్దేశం చేసింది. గద్వాల నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రచురించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO)కి EC అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు. కృష్ణమోహన్ రెడ్డి స్థానంలో అరుణనే MLAగా గుర్తించాలని, ఇకనుంచి ఆమే కొనసాగుతారంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని సూచించారు.
హైకోర్టు తీర్పు ప్రకటించగానే డీకే అరుణ… రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. అటు అసెంబ్లీ సెక్రటరీని కలిసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో హైకోర్టు కాపీలతో ఆమె ప్రతినిధులు.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించారు. తీర్పు కాపీలను సునిశితంగా పరిశీలించిన CEC సెక్రటరీ.. అరుణను MLAగా గుర్తించాలంటూ లెటర్ రాశారు.
గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంతో గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా పేర్కొంటూ అరుణను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. BRS అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి 2018 ఎలక్షన్లలో పోటీ చేయగా… ఆయన గెలుపును సవాల్ చేస్తూ 2019లో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని, కొన్నింటిని అఫిడవిట్ లో దాచిపెట్టారన్నది అరుణ ఆరోపణ. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు గాను కృష్ణమోహన్ రెడ్డికి రూ.2.50 లక్షలను జరిమానాగా కోర్టు విధించింది. పిటిషనర్ DK అరుణకు ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని మొత్తంగా కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షలు ఫైన్ వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కొత్తగూడెం BRS MLA వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు పడింది. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వనమా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీం స్టే ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు.