Published 05 DEC 2023
సోనియాగాంధీ నన్ను ప్రధానిని చేయడానికి ఇష్టపడలేదని, ఆమె వల్లే ఆ పదవిని అందుకోలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనాడు బాధపడ్డ మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2004లో ఆయన తన కూతురు శర్మిష్ఠ ముఖర్జీతో పంచుకున్న మాటల్ని ఆమె బయటపెట్టారు. 2004లో యూపీఏ(United Progressive Alliance) ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధాని పదవిపై సోనియా విముఖత కనబర్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక స్థానంలో ప్రణబ్ ముఖర్జీ.. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ప్రకటిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కుమార్తెగా ఆనాడు తనకు చెప్పిన విషయాల్ని పుస్తకం ద్వారా శర్మిష్ఠ వెల్లడిస్తున్నారు. ప్రణబ్ జీవిత విశేషాలతో ఆమె ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్(In Pranab My Father: A Daughter Remembers)’ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు.
గాంధీ కుటుంబానికి విధేయుడు
తండ్రి పట్ల సోనియా అలా వ్యవహరించినా ప్రణబ్ ఏనాడూ భేదభావం చూపలేదని, లోలోపలే మథనపడ్డారని శర్మిష్ఠ గుర్తు చేసుకున్నారు. నెహ్రూ-ఇందిర కాలం నుంచి గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా, సోనియా నమ్మకస్తుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ప్రణబ్.. రాహుల్ కు ఛరిష్మా, రాజకీయాలపై అసలు అవగాహనే లేని పరిస్థితుల్లో ప్రధాని అవుతానని భావించారు. కానీ సోనియా ఆనాడు తీసుకున్న నిర్ణయంతో జీవితంలో ప్రధాని కాలేదన్న లోటు మాత్రం ఆయనలో ఉండిపోయినట్లు బుక్ లో పొందుపరిచిన పాత జ్ఞాపకాలను పబ్లిషర్ అయిన రూప పబ్లికేషన్స్ తెలిపింది. 2004లో అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా కాంగ్రెస్ నిలవడంతో.. ప్రధాని ఎంపికను మిత్రపక్షాలన్నీ సోనియా చేతుల్లో పెట్టాయి. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం వంటి కీలక శాఖల్ని ప్రణబ్ నిర్వర్తించారు. 2012-17 వరకు భారత 13వ రాష్ట్రపతిగానూ పనిచేసిన ఆయన.. 84 ఏళ్ల వయసులో ఆగస్టు 31, 2020 నాడు కన్నుమూశారు.
1984లోనే ప్రధాని పదవికి ఛాన్స్
‘ప్రధాని కావాలని నాకూ ఇష్టం ఉంది.. ఆ పదవి కావాలని ఎవరు వద్దనుకుంటారు.. కానీ అది నాకు అర్జంటుగా కావాలని మాత్రం అనుకోలేదు’ అంటూ తన తండ్రి చెప్పిన మాటల్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 2004 డిసెంబరు 31 తర్వాత ఇక ఎలాంటి జ్ఞాపకాల్ని పేపర్ పై ఆయన పెట్టలేదు. చివరగా రాసింది మాత్రం సోనియా ప్రధాని పదవిని తిరస్కరించిన విషయమే. ‘ఆనాడు సోనియా తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది.. పార్టీలోని నేతలతోపాటు ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఏకంగా ప్రధాని పదవినే ఆమె వద్దనుకున్నారు.. ఆనాటి డిసిషన్ వల్ల బీజేపీ-కాంగ్రెస్ పరస్పర దాడుల నుంచి దేశం బయటపడింది’ అని ప్రణబ్ రాసుకున్నట్లు తన పుస్తకంలో శర్మిష్ఠ ముఖర్జీ తెలియజేశారు. ప్రధాని పదవి అనేది 2004లోనే తొలిసారి కాదని, 1984లోనే ఆ ఛాన్స్ దగ్గరగా వచ్చినట్లు తన తండ్రి చెప్పారని ఆమె గుర్తు చేశారు. 2021లో పాలిటిక్స్ కు స్వస్తి పలికే వరకు ప్రణబ్ జీవిత విశేషాలతో కూడిన ఈ బుక్.. ఈ నెల 11న అందుబాటులోకి రానుంది.