దేశంలోనే అత్యంత పేరు మోసిన న్యాయ కోవిదుడతను(Eminent Jurist). భోపాల్ గ్యాస్ లీక్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ పై 1985లో కేసును వాదించిన న్యాయవాది ఫాలీ శామ్ నారీమన్. ఈ కేసులో 470 మిలియన్ డాలర్లను బాధితులకు ఇచ్చేందుకు కోర్టు బయట ఒప్పందం కుదరడంలో నారీమన్ దే కీలకపాత్ర. ఈ కురువృద్ధుడు తన 95 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ‘వెన్ మెమొరీ ఫేడ్స్’ పేరిట తన బయోగ్రఫీని బయటపెట్టిన వ్యక్తి నారీమన్. ఈయన తనయుడు రోహింటన్ నారీమన్… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
1975లో పదవీత్యాగం
1975 సంవత్సరం అంటేనే ఇందిరాగాంధీ పాలన గుర్తుకు వస్తుంది. దేశంలో అత్యవసర పరిస్థితి(Emergency) విధిస్తూ తీసుకున్న అత్యంత క్రూరమైన చర్యను వ్యతిరేకిస్తూ ఆనాడే ఫాలీ ఎస్.నారీమన్ తన పదవిని త్యాగం చేశారు. అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఇందిర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నదంటూ నారీమన్.. తన పదవిని వదులుకున్నారు. దేశ సర్వోన్న న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 1971లో రిజిస్టరై ఎన్నో కేసుల్ని వాదించి శిఖర సమానుడిగా నిలిచారాయన.
ఒక శకం ముగిసిందంటూ…
నారీమన్ మృతితో దేశం ఒక గొప్ప న్యాయ కోవిదుణ్ని కోల్పోయిందని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయ సంబంధిత అంశాల్లో అపార అనుభవమున్న(Legal Intellectual) నారీమన్… సామాన్య ప్రజలకు న్యాయమందించేందుకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని గుర్తు చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందన్న మోదీ.. నారీమన్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ‘X’ ద్వారా పంచుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మరోవైపు ఒక శకం ముగిసిందంటూ మరో సీనియర్ లాయర్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆవేదనతో అన్నారు.
అత్యున్నత పౌర పురస్కారాలు…
నారీమన్ సేవల్ని గుర్తించిన ప్రభుత్వాలు 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాల్ని ప్రకటించాయి. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1972 నుంచి 1975 వరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయి 2005 దాకా సేవలందించారు. బాంబే హైకోర్టులో 22 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసిన ఈయన.. 1971లో సుప్రీంకోర్టుకు వెళ్లారు.