కన్నకూతుర్ని దారుణంగా చంపాడు.. మృతదేహాన్ని మోటార్ సైకిల్ కు కట్టి ఊరంతా తిప్పాడు.. చివరకు రైల్వే ట్రాక్ పక్కన డంపింగ్ యార్డ్ లో అనాథలా మృతదేహాన్ని పడేశాడు.. ఇదీ కన్నతండ్రి ఓ పదహారేళ్ల అమ్మాయిపై సాగించిన వికృత చేష్ట. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ దయనీయ ఘటన.. పంజాబ్ లోని అమృత్ సర్ సమీపంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన CC ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వార్త కలకలం రేపింది. వేరొకరి ఇంట్లో ఒక రాత్రి ఉందంటూ ఆ అమ్మాయి తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. వింటేనే దయనీయంగా ఉన్న ఈ ఘటనలో.. ఆ కర్కశ కన్నతండ్రి చెప్పిన మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. CC ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని కన్నతండ్రిని అరెస్టు చేసిన పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
‘నేను నా ఊర్లో గౌరవంగా, హుందాతో బతుకుతున్నా.. చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరుసటి రోజు తిరిగి వచ్చింది.. ఇది మా కుటుంబానికి అత్యంత అవమానకరం.. సంప్రదాయాల్ని మంటగలిపిన కూతుర్ని మామూలుగా చంపడం కాదు.. ఇది అందరికీ తెలియాలి.. అందుకే బైక్ కు కట్టేసి ఊరంతా తిప్పా.. ఇక నుంచి ఈ ఊర్లో అమ్మాయిలు తప్పు చేయాలంటే భయపడాలి.. మరోసారి ఇలాంటివి జరగకుండా తల్లిదండ్రులు కూడా దీన్ని చూడాలి’ అంటూ పోలీసుల ఎదుట ఆ కర్కశ తండ్రి జరిగిన ఘటన గురించి నోరు విప్పాడు. నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం పిల్లల బాధ్యత.. పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులది అన్న మెసేజ్.. ఈ ఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చినట్లుగా అర్థమవుతుంది.