
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎలక్షన్లలో అలర్లు చెలరేగాయి. ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పెద్దదై కాల్పుల వరకూ వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘర్షణలు, బాంబు దాడులు, కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మందికి గాయాలయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తుపాన్ గంజ్, ఖర్ గ్రామ్ తోపాటు పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. మృతుల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా కేంద్ర పారామిలిటరీ బలగాల్ని మోహరించారు.
ఈ ఘటనలపై BJP, తృణమూల్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేస్తూ బ్యాలెట్ బాక్స్ లను దుండగులు దగ్ధం చేశారు. రాష్ట్రమంతటా నిషేధాజ్ఞలున్నా ఘర్షణలు అదుపులోకి రావడం లేదు. 600 కంపెనీల పారా మిలిటరీ బలగాలు, 70 వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రతలో ఉన్నారు.