జైలుకు వెళ్లాల్సి వస్తే తాను ఏం చేస్తానో ముందుగా చెప్పిన విధంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) కేజ్రీవాల్ తన ప్లాన్ అమలు చేశారు. ఆయన జైలులోనే ఉంటూ పరిపాలన సాగిస్తారని మంత్రి అతిషి మూడు రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో అరెస్టయి ప్రస్తుతం ED కస్టడీలో ఉన్న ఆప్(AAP) కన్వీనర్… ప్రజా సమస్యకు సంబంధించిన అంశపై అక్కణ్నుంచే ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సదరు మంత్రి అతిషే ప్రకటిస్తూ తమ అధినేత కమిట్మెంట్ కు నిదర్శమంటూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
వాటర్ సప్లయ్ పై…
ఢిల్లీలో ఏర్పడిన నీటి కొరతను నివారించేందుకు గాను అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా(Water Supply) అందించాలన్నది ఆ ఆదేశాల్లోని సారాంశం. ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేదుకు గాను నీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సప్లయ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి అయిన అతిషిని ఆదేశిస్తూ ఉత్తర్వులు(Orders) పంపించారు. ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ(CS)తోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తెలియజేశారు. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు మంత్రి అతిషి అన్నారు.