సిక్కిం ఆకస్మిక వరదలకు నేపాల్ భూకంపమే కారణమా… నిన్నటి భూకంపం ఈరోజు మేఘాల విస్ఫోటనాని(Cloud Burst)కి దారితీసిందా.. అన్న కోణంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈశాన్య రాష్ట్ర ‘క్లౌడ్ బరస్ట్’కు నేపాల్ భూకంపమే(Earth Quake) కారణమా అని విశ్లేషణ(Analyse) చేస్తున్నారు. మంగళవారం నాడు నేపాల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకోపానికి సిక్కింలోని దక్షిణ లోనాక్ సరస్సు ప్రభావితమైందన్నదానిపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ సౌత్ లోనాక్ సరస్సు ఉప్పొంగడం వల్లే తీస్తా నది(Teesta River)కి ఉన్నట్టుండి భారీ వరదలు వచ్చాయి. సరస్సు ఉప్పొంగడంతో సిక్కింలోని అతి పెద్ద జల విద్యుత్తు ప్రాజెక్టు అయిన చుంగ్ తాంగ్ బ్యారేజ్ తెగిపోయింది. తీస్తా స్టేజ్-3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా చుంగ్ తాంగ్ డ్యాం వద్ద 1,200 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. ఇందులో సిక్కిం రాష్ట్రానిదే మెజారిటీ వాటా. అయితే సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) లెక్కల ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా తీస్తా నది వరద డేంజరస్ లెవెల్ కంటే తక్కువగానే ఉంది. మెల్లి, సింగ్టామ్, రోహ్ తక్ స్టేషన్లలోనూ ఎలాంటి విపత్కర పరిస్థితులు లేవని ప్రకటించింది. అంటే మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత తలెత్తిన ‘క్లౌడ్ బరస్ట్’ వల్లే ఇది జరిగిందన్నది స్పష్టమవుతున్నది.
హైదరాబాద్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శోధన
సిక్కిం ‘క్లౌడ్ బరస్ట్’కు నేపాల్ భూకంపమే కారణమా అన్న అనుమానం హైదరాబాద్ శాస్త్రవేత్తలకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(NRSA) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఇందుకు కారణంగా నిలిచాయి. సెప్టెంబరు 17న విడుదల చేసిన చిత్రాల(Photoes)తో పోల్చితే దక్షిణ లోనాక్ సరస్సు విస్తీర్ణం 100 హెక్టార్ల వరకు తగ్గిందని గుర్తించగలిగారు. సరస్సు ఉప్పొంగడం వల్ల ఉత్తరాన తీస్తా నది పరివాహక ప్రాంతంలో ఆకస్మిక వరద వచ్చిందన్న కోణాన్ని ఇది సూచిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని సిక్కిం సర్కారు పెను విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్ కు 30 కిలోమీటర్ల దూరంలో గల ఇంద్రేణి వంతెనగా పిలుచుకునే సింగ్ టామ్ వద్ద ఉన్న స్టీల్ బ్రిడ్జి తీస్తా నదిలో కొట్టుకుపోయింది.
8 మంది మృతి, పలువురి గల్లంతు
చుంగ్ తాంగ్ డ్యామ్ నుంచి 20 అడుగుల మేర నీటిని వదలడంతో విపత్కర పరిస్థితి తలెత్తి 69 మంది గల్లంతు కాగా… అందులో 22 మంది జవాన్లు ఉన్నారు. అయితే గల్లంతయిన ప్రజల్లో 8 మంది మృత్యువాత పడ్డట్లు సిక్కిం ప్రభుత్వం తెలిపింది. అయితే ఒక సైనికుడితోపాటు 166 మందిని ఇప్పటివరకు రక్షించామని చెప్పింది. ఈ ఘటనపై సిక్కిం CM ప్రేమ్ సింగ్ తమాంగ్ తో ప్రధాని మోదీ మాట్లాడి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. నేపాల్ భూకంప ప్రభావం ఢిల్లీతోపాటు ఉత్తర భారతంపై పడింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా వివిధ ప్రాంతాల్లో భూమి కంపించి జనం పరుగులు తీయాల్సి వచ్చింది.