దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఇప్పటికే సగం సెగ్మెంట్ల పోలింగ్ పూర్తయింది. మిగతా రాష్ట్రాల్లో జరిగే మలి విడత(Another Phase) ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. NDA తరఫున ప్రధాని మోదీ, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరస్పరం విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇవి హద్దులు దాటడంతో ఈ మధ్యనే ఈ ఇద్దరికీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది.
మాజీ జడ్జీల లేఖ
ఇలా బహిరంగసభల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న రెండు పార్టీల అగ్రనేతలు బహిరంగ చర్చకు రావాలంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు లేఖ(Letter) రాశారు. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ అజిత్ పి.షాతోపాటు హిందూ పత్రిక చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అయిన ఎన్.రామ్ ఈ లేఖలు రాశారు.
‘మీరు తరచూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు చూస్తున్నాం.. కానీ వాటికి సంబంధించి ఎలాంటి అర్థవంతమైన చర్చలు చూడలేకపోతున్నాం.. సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మీ ఆరోపణలు సైతం పక్కదారి పట్టడం లేదా వాటిని చెడు దారుల్లోకి మళ్లించడం జరుగుతున్నది.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీరిద్దరూ బహిరంగ చర్చకు రావాలని కోరుకుంటున్నాం.. ఇలా ఇద్దరూ చర్చకు రావడం వల్ల ప్రజలకు సరైన సంకేతాలు వెళ్తాయి..’ అన్నది లేఖలోని సారాంశం.