
మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేశారన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇన్వాల్వ్ మెంట్ ఉందని భావిస్తున్న మరికొందరిని పట్టుకునే వేటలో పడ్డారు. మధ్యాహ్నం ఒక నిందితుణ్ని అదుపులోకి తీసుకోగా, సాయంత్రం మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఘటన జరిగిన తౌబల్ జిల్లాలోని నాంగ్పోక్ సెక్మల్ PS పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లోయతోపాటు కొండ ప్రాంతాల్లోనూ స్టేట్ పోలీసులతోపాటు కేంద్ర బలగాలు విస్తృత తనిఖీలు జరుపుతున్నాయి. ఈ సోదాల్లో 5 ఆయుధాలు స్వాధీనమయ్యాయి.
మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా 129 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్న బలగాలు.. అల్లర్లకు కారణమైన 657 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్(national human rights commission) ఈ అమానవీయ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈశాన్య రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు(supreme court), జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం, దేశవ్యాప్తంగా ఇది సంచలనాత్మకంగా మారడంతో బీరేన్ సింగ్ సర్కారు చర్యలను వేగవంతం చేసింది.