పాకిస్థాన్ తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ఆర్మీ(Army) చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించనుంది. ఇందులో నమోదు చేసుకున్న అధికారులు, సిబ్బందిని రెడీ చేసుకోవాలని ఆదేశించింది. టెరిటోరియల్ ఆర్మీ అంటే రిజర్వ్(Reserve) ఫోర్స్. దేశంలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి పోరాడుతుంది. వీరంతా బయట ఉద్యోగాలు చేస్తూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తారు. 1948లో దీనిపై చట్టం రాగా, 1949 నుంచి అమలవుతోంది. దీంట్లో 50 వేల మంది వరకు ఉన్నారు. 1962, 1965, 1971 యుద్ధాల్లో ఈ ఆర్మీ పనిచేయగా ఇందులో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు. ఎం.ఎస్.ధోని, మోహన్ లాల్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా.. లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్, నాన్-కమిషన్డ్ ఆఫీసర్స్ ఉంటారు. కనీస అర్హతతో సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి పెన్షన్ సహా పలు ప్రయోజనాలుంటాయి.