లోకోపైలట్ లేకుండానే ఓ రైలు 78 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించిందంటే.. అదీ 100 కిలోమీటర్ల స్పీడ్(Speed)తో సాగిందంటే.. ఎంతటి భయానక పరిస్థితో ఊహించుకోవచ్చు. ఆ దారిలో మరో రైలు రావడం, రైల్వే క్రాసింగ్ ల వద్ద ఉండే ఇతర వెహికిల్స్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కానీ 78 కిలోమీటర్ల పొడవునా ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని చివరకు దాన్ని ఆపడానికి నానా తంటాలు పడి ఇసుక బస్తాలు వేసి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు అధికారులు. చిప్ స్టోన్స్ లోడ్ తో జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ బయల్దేరిన గూడ్స్ ను కథువా రైల్వే స్టేషన్ లో ఆపారు. డ్రైవర్ ఛేంజ్ కోసం ఆపిన రైలు నుంచి దిగిపోయిన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్.. హ్యాండ్ బ్రేక్(Hand Break) వేయకుండానే వెళ్లిపోయారు.
స్లోప్ వల్ల స్పీడ్…
దీంతో రైలు వెళ్తున్న దారి వాలుగా ఉండటంతో పఠాన్ కోట్ వైపు దూసుకెళ్లింది. కొంతదూరం వెళ్లిన తర్వాత క్రమంగా స్పీడ్ అందుకుని అది గంటకు 100 కి.మీ. వేగంతో అలా 78 కిలోమీటర్లు ప్రయాణించింది. విషయం తెలుసుకున్న అధికారులు బంగ్లా, ముకేరియా వంటి నాలుగు స్టేషన్లలో ఆపాలని చూసినా సాధ్యం కాలేదు. చివరకు పంజాబ్ లోని ముకేరియా స్టేషన్ దాటాకా ఉంచీబస్సీ వద్ద గూడ్స్ రైలు స్పీడ్ తగ్గడం(Slow)తో హోషియార్ పూర్ జిల్లాలోని ఓ స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఇసుక బస్తాలతో రైలును ఆపినట్లు అధికారులు తెలిపారు.
రైల్వే మంత్రి సీరియస్…
ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జరిగిన తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైలు వెళ్తున్న మార్గంలో అప్పటికప్పుడు ఆధునిక పద్ధతి(Mechanical Method) రైల్వే క్రాసింగ్స్ మూసివేసి రోడ్డు ట్రాఫిక్ లేకుండా చేసినట్లు రైల్వే పోలీస్ ASI గురుదేవ్ సింగ్ తెలిపారు. సరిగ్గా 2016లోనూ ఇలాంటి సిట్యుయేషనే ఎదురైంది. మడగావ్-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ సైతం లోకోపైలట్ లేకుండా 15 కిలోమీటర్ల దూరం వెళ్లిపోవడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు.