కత్తిపోట్లకు గురై వార్తల్లోకెక్కిన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్.. చికిత్స తర్వాత ఇంటికి చేరాడు. కానీ ఆయన కుటుంబానికి బిగ్ షాక్ తప్పేలా లేదు. సైఫ్ ఫ్యామిలీకి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తుల్ని(Properties) మధ్యప్రదేశ్ సర్కారు స్వాధీనం చేసుకునేలా ఉంది. సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ 2011లో మృతిచెందగా, ఆ కుటుంబానికి సైఫే వారసుడు. ఈయన, తల్లి షర్మిలా ఠాగూర్ సహా కుటుంబ సభ్యుల పేరిట భోపాల్ లో భారీగా ఆస్తులున్నాయి. వీరికి చెందిన 100 ఎకరాల భూముల్లో సుమారు లక్షన్నర మంది నివసిస్తుండగా, కోర్టులో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ భూమిపై పదేళ్లుగా కొనసాగుతున్న ఎనిమీ ప్రాపర్టీ(Enemy Property) కేసులో ప్రస్తుతం స్టే ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి సైఫ్ కుటుంబానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నెల రోజుల గడువిచ్చింది. అయినా ఆ ఫ్యామిలీ ఎలాంటి దావా వేయకపోగా, ఇచ్చిన గడువు ముగియడంతో ఇక ఆ ఆస్తుల్ని ప్రభుత్వం చేజిక్కించుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్-1968 ప్రకారం.. విభజన తర్వాత పాకిస్థాన్ వెళ్లిన వ్యక్తులు భారత్ లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్రానికి హక్కు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తుల్ని నియంత్రించాలని సర్కారు చూడగా, సైఫ్ ఫ్యామిలీ 2015లో సవాల్ చేసింది. పటౌడీ వంశ చివరి నవాబు కుమార్తె అబిదా సుల్తాన్ ఎప్పుడో పాక్ వెళ్లిపోయారు. దాంతో ఆ ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించగా, నవాబు మరణం తర్వాత రెండో కుమార్తె మెహర్ తాజ్ బేగంను ఎస్టేట్ కు వారసురాలిగా ప్రకటించారు. ఈమె వారసులుగా భావిస్తున్న సైఫ్ కుటుంబం.. ఇప్పుడేం చేస్తుందో చూడాలి.