Published 25 Jan 2024
ఉత్తర్ ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) జరిపిన పరిశోధనల సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ విషయాల్ని ASI తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని లాయర్ విష్ణుశంకర్ జైన్ తెలియజేశారు. మసీదు కింద 34 శాసనాలు గుర్తించినట్లు ASI తెలిపిందని, వీటికితోడు మరో 32 ముద్రికలు కూడా నిర్ధారించారని వివరించారు. హిందూ ఆలయ రాతి కట్టడాలై శాసనాలు ఉన్నాయని, వాటి నిర్మాణంలోనే శాసనాలు వాడినట్లు గుర్తించామని నివేదిక స్పష్టం చేసింది.
తెలుగులో పదాలు…
జ్ఞానవాపి మసీదు కింద గల ఆలయంలో లభ్యమైన శాసనాలు తెలుగు, కన్నడ, దేవనాగరి, గ్రంథ భాషల్లో ఉన్నాయని ASI సర్వే తేల్చింది. శాసనాలపై జనార్దన, రుద్ర, ఉమేశ్వర దేవతల పేర్లు ఉన్నట్లు విష్ణుశంకర్ జైన్ ప్రకటించారు.
జరిగిన కథ ఇది…
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్(Scientific) సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ ఆదేశాల్లో భాగంగా పోలీసు కమిషనర్ అశోక్ ముథా జైన్, జిల్లా జడ్జి ఎస్.రాజలింగం నేతృత్వంలో మొత్తం 41 మంది ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)కు చెందిన అధికారులు సర్వేలో పాల్గొన్నారు. ఆలయ పునాదులపై మసీదు నిర్మించారన్న వాదనలపై వాస్తవాలు గుర్తించేందుకు కోర్టు ఈ అనుమతి ఇచ్చింది. ASI సర్వేకు పర్మిషన్ ఇస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకు ASIకి ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. గతేడాది జులై 21న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.