ఉత్తరాదిని వర్షాలు(rains) బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం దిల్లీ సమీపంలోని యమునా నది గరిష్ఠ నీటిమట్టాన్ని దాటిపోగా.. ఈరోజు సైతం అదే తీరుగా పయనిస్తోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు 205.81 మీటర్లకు చేరుకున్నట్లు కేంద్ర జల సంఘం(CWC) ప్రకటించింది. గత వారం 208.45 మీటర్లతో ఆల్ టైమ్ రికార్డు గా హయ్యెస్ట్ లెవెల్ కు చేరిన నీటిమట్టం.. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ తో డేంజరస్ మార్క్ ను రీచ్ అయింది. 205.33 మీటర్లే గరిష్ఠ నీటిమట్టం కాగా అంతకుమించి నది ప్రవహిస్తోంది. అటు హిందోన్ నది ఉప్పొంగడంతో నోయిడా జలమయమైంది. నోయిడా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కు ఇప్పటికే తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిన వర్షాలు ఇంకా తెరిపినివ్వడం లేదు. 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఉన్నందున 8 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలోనూ వర్షాలు వణికిస్తున్నాయి. పురోలా, బార్కోట్, దండో ప్రాంతాల్లో 50 ఇళ్లు నేలకూలగా.. మరో 50 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 40 గ్రామాల్లో కరెంటు లేక అంధకారం అలుముకుంది.