నేషనల్ క్యాపిటల్ దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు సృష్టిస్తున్న బీభత్సానికి 19 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో హస్తిన అతలాకుతలం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు తెగిపోయాయి. ఈ రాష్ట్రంలో కొండచరియలు మీద పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్ స్టేట్స్ లోనూ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తరాదిలో మొత్తం 19 మంది మృతిచెందారు.
దిల్లీలో గత 40 ఏళ్ల చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అంతటా అలర్ట్ ప్రకటించారు. శనివారం పొద్దున్నుంచి ఆదివారం పొద్దున వరకు 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత ఈ స్థాయి వర్షపాతం రికార్డవడం ఇదేనని అధికారులు తెలిపారు. స్కూళ్లను మూసివేయడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లడ్ తో యమునా నదిలో నీటి మట్టం బాగా పెరుగుతోంది. ఇది డేంజరస్ స్థాయికి చేరుకుంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) చెబుతోంది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో దిల్లీ ప్రజలు భయం గుప్పిట కాలం గడుపుతున్నారు.