దేశ రాజధాని ఢిల్లీ.. లాక్ డౌన్ గుప్పిట్లో చిక్కుకుంది. జీ20 సమావేశాల దృష్ట్యా హస్తిన మొత్తం భద్రతా బలగాల(Security Forces) చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడక్కడ ఎటు చూసినా నిర్మానుష్య వాతావరణం.. చుట్టూ డేగ కళ్లతో పహారా.. అడుగు తీసి అడుగు వేయలేని స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పాల్గొంటున్న ఈ మీటింగ్స్ తొలిసారిగా భారత్ లో జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ గా జీ20 సదస్సు(Summit)కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమెరికా, బ్రిటన్, చైనా సహా ఇంచుమించు అన్ని అగ్ర రాజ్యాలు ఇందులో పాల్గొంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 75 శాతం ఆక్రమించిన రాజ్యాలు ఈ జీ20లో భాగస్వాములు.
ఒక్క అమెరికా అధ్యక్షుడు వస్తేనే సెక్యూరిటీ ఎలా ఉంటుందో చూస్తుంటాం. కానీ 40 దేశాల అధినేతలు వస్తారంటే ఇక ఎంత హడావుడి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలోనూ అదే తీరు కనపడుతున్నది. జీ20 సమ్మిట్ జరిగే భారత్ మండపం సహా రాజధాని మొత్తం భద్రతా బలగాల నీడలో చిక్కుకుంది. వచ్చే మూడు రోజుల పాటు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి 160 విమానాలు క్యాన్సిల్ చేశారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.