Published 05 Dec 2023
అనిశ్చిత వాతావరణానికి తెరపడింది…
అనుమానాల్లేకుండా సీఎం ఎవరో తేలిపోయింది…
రేవంత్ కు రైట్ రైట్ అంటూ హైకమాండ్ తలూపింది…
ముఖ్యమంత్రి(Chief Minister) ఎంపిక విషయంలో నెలకొన్న హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడింది. రాష్ట్రంలో చెలరేగిన అసంతృప్తులను చల్లార్చుతూ CM అభ్యర్థిని తేల్చేసింది. నేరుగా రాహుల్ గాంధీయే జోక్యం చేసుకోవడంతో రేవంత్ కు అడ్డంకి లేకుండా పోయింది. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన CLP సమావేశం పరిణామాలను ఢిల్లీలోని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో చర్చించారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే సహా అగ్ర నేతలంతా ఖర్గేతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ రోజు సాయంత్రానికి అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
సాయంత్రం డీకే రాక
సీఎల్పీ నాయకుడి విషయంలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు భట్టి విక్రమార్కతోపాటు ఉత్తమ్ ను ఢిల్లీ పిలిపించారు. వీరిద్దరితో మాట్లాడిన అగ్రనేతలు.. రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. రేవంత్ కే సీఎం పీఠం కట్టబెట్టాలని రాహుల్ విస్పష్టంగా చెప్పడంతో ఇక ఆ మాటకు తిరుగులేకుండా పోయింది. అయితే ఈ వ్యవహారంపై ఏ ఒక్కరు కూడా బయటకు వివరాలు వెల్లడించలేదు. డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ కు వచ్చి మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. AICC అబ్జర్వర్ల నేతృత్వంలో సాగే ఈ భేటీలోనూ MLAల అభిప్రాయాల్ని తీసుకుంటారు. అనంతరం ఆ రిపోర్టును తిరిగి ఢిల్లీకి పంపడంతో ప్రక్రియ పూర్తి కానుంది.