Published 14 Dec 2023
జ్ఞానవాపి తరహాలోనే మరో మసీదులోనూ శాస్త్రీయ సర్వేకు హైకోర్టు అనుమతించింది. మథురలోని షాహీ ఈద్గా మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలోనే షాహీ ఈద్గా మసీదు ఉంది. నిజానిజాల్ని వెలికి తీసేందుకు గాను జ్ఞానవాపి తరహాలోనే మథురలోనూ శాస్త్రీయ సర్వే చేపట్టవచ్చంటూ ఆదేశాలిచ్చింది. మసీదు కన్నా ముందు అక్కడ శ్రీకృష్ణుని ఆలయం ఉండేదని, కానీ కాలక్రమేణా అక్కడి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయంటూ భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ కమిటీతోపాటు ఏడుగురు వ్యక్తులు పిటిషన్లు వేశారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు.. సర్వేకు అనుమతిస్తూనే అది న్యాయస్థానం పర్యవేక్షణలోనే ఉంటుందని తెలియజేసింది. ఇందుకోసం ముగ్గురు అడ్వొకేట్ కమిషనర్లను నియమిస్తామని, కమిషన్ కు సంబంధించిన విధివిధానాలు(Guidelines)ను ఈ నెల 18న జరిగే విచారణలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది.
ఏమిటీ జ్ఞానవాపి సర్వే…
ఆలయ పునాదులపై మసీదు నిర్మించారన్న వాదనలపై వాస్తవాలు గుర్తించేందుకు వారణాసిలోని జ్ఞానవాపిలో సర్వే జరిగింది. శాస్త్రీయ సర్వేకు గాను ASI(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కు సెషన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలోని మసీదులో ASI సర్వేకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. జులై 21న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించగా.. పోలీసు కమిషనర్ అశోక్ ముథా జైన్, జిల్లా జడ్జి ఎస్.రాజలింగం పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. ఆ తర్వాత దీనిపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.