Published 22 Dec 2023
హిజాబ్ ధారణపై కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు(Sidharamaiah Government) సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ పై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వస్త్రధారణపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇక నుంచి విద్యా సంస్థల్లోనూ హిజాబ్ ధారణపై ఆంక్షలు ఉండబోవంటూ రేపట్నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయన్నారు. గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అమలైన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తలను కప్పి ఉంచే ‘హిజాబ్’ వస్త్రధారణ అనేది ఇక మహిళల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. తద్వారా మహిళలకున్న స్వేచ్ఛను పునరుద్ధరించినట్లయిందని సిద్ధరామయ్య సర్కారు తెలియజేస్తూ.. ఈ విషయంలో చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. BJP సర్కారు తెచ్చిన విధానాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సందర్భంగా గత మే నెలలో అక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇచ్చిన హామీ మేరకు…
‘హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఏ డ్రెస్ వేసుకోవాలనేది, ఏం తినాలనేది మీ ఇష్టం.. దాన్ని ఆపడానికి మేమెవరం.. గత ప్రభుత్వం ప్రజల్ని వర్గాలుగా విడగొట్టింది.. వస్త్రధారణ, కులాల ఆధారంగా వ్యవస్థను చీల్చింది’ అంటూ మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధరామయ్య కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన ఆరుగురు స్టూడెంట్స్ ని ఉడుపిలోని ప్రి-యూనివర్సిటీ మహిళా కాలేజీలో రెండేళ్ల క్రితం క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు. హిజాబ్ తో వస్తే విద్యాసంస్థల్లోకి అనుమతించేది లేదంటూ సర్య్కులర్ జారీ అయింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతోపాటు 2021 డిసెంబరులో ఉద్యమాలు జరిగాయి. కర్ణాటక హైకోర్టు సైతం అప్పటి సర్కారు నిర్ణయాన్ని సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది.