దేశ రాజధాని(National Capital) ఢిల్లీలో ఈరోజు పొద్దున వచ్చిన భూకంపం చిన్నదే అయినా.. ఉత్తరాదిని వణికించింది. రిక్టర్ స్కేలు(Richter Scale)పై 4 తీవ్రత ఉంటే.. ఆ ప్రకంపనలు మాత్రం పెద్ద భూకంపాన్ని తలపించాయి. ధౌలా కువాన్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలేజ్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఈ చిన్న ప్రకంపనలకే తల్లడిల్లిన ఢిల్లీ.. ఎంతవరకు సేఫ్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సురక్షితమేనా…!
భౌగోళికంగా ఢిల్లీలో భూకంపాలు సాధారణం. 2020లో 3 తీవ్రతతో మూడు వచ్చాయి. భూకంపాలు ఎక్కువుండే సిస్మిక్ జోన్-4లో ఢిల్లీ ఉంది. 1720 నుంచి ఇప్పటిదాకా 5.5 తీవ్రతతో ఐదు భూకంపాలు వచ్చాయి. హిమాలయాలు సహా ఉత్తర భారతంలో.. యురేషియన్ ప్లేట్ తో భారత టెక్టానిక్ ప్లేట్ ఢీకొనడం వల్ల ప్రకంపనలు వస్తుంటాయి. స్ప్రింగ్ మాదిరిగా ఈ ప్లేట్లు శక్తిని నిల్వ చేస్తుండగా, అవి ఒకదానిపై ఒకటి జారినపుడు శక్తి విడుదలై భూకంపానికి దారితీస్తుంది. అధిక జనసాంద్రత, ప్లానింగ్ లేని నిర్మాణాలతో ఢిల్లీ ప్రమాదంలో ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDMA) విశ్లేషణలో తేలింది. అక్కడ 6.5% ఇళ్లకు భారీగా.. 85% నివాసాలకు మధ్యస్థంగా నష్టం జరిగే ప్రమాదముంది. ఒకవేళ విపత్తు సంభవిస్తే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయట. అయితే భౌగోళిక సెట్టింగ్ కారణంగా బలమైన ప్రకంపనల్ని తట్టుకోగలదని తేలింది. భారీ భూకంపాల్ని తట్టుకునే శక్తి ఉన్నా.. పరిస్థితి అదుపుతప్పితే మాత్రం ఏం చేయలేమంటోంది NDMA.