ఇరువర్గాల భారీ ఎన్ కౌంటర్(Encounter)తో దండకారణ్యం మరోసారి ఉలిక్కిపడింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పులు అటవీప్రాంతాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లో జరిగిన మరో ఎన్ కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. సంఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం కాగా, ఓ అధికారితోపాటు మొత్తం ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
జాయింట్ ఆపరేషన్…
హెపటోలా ఫారెస్టు ప్రాంతంలోని భీకర ఏరియా అయిన అబూజ్ మఢ్ కు సమీపంలో బైనగుండా-కోరోనర్ గ్రామాల మధ్య ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. ఛోటాబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని కాంకేర్ SP కల్యాణ్ ఎలిసెల తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(DRG) జాయింట్ గా కూంబింగ్ జరుపుతున్న టైమ్ లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇన్సాస్, ఏకే-47, SLR, కార్బైన్, 303 రైఫిల్స్ భారీయెత్తున దొరికాయి. సీనియర్ కమాండర్లు శంకర్ రావు, లలిత ప్రాణాలు కోల్పోగా, ఆ ఇద్దరిలో ఒక్కొక్కరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
భారీ నష్టం…
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో కీలకంగా పనిచేసే వినోద్ గావ్డేతోపాటు రాజ్మన్ అనే మావోయిస్టు లీడర్ మృత్యువాత పడగా, వినోద్ పై 10 లక్షల రివార్డు ఉంది. ఇది బస్తర్ లోనే మరో పెద్ద ఎన్ కౌంటర్ IG పి.సుందర్ రాజ్ అన్నారు. మావోయిస్టులు పెద్దయెత్తున భేటీ అయ్యారన్న సమాచారంతో 200 మంది పోలీసులు కూంబింగ్ చేపట్టారు. గాయపడ్డ పోలీసుల్ని తరలించేందుకు హెలికాప్టర్లు తీసుకొచ్చినా చీకటి సమయంలో అవి ఎగరలేని పరిస్థితి ఏర్పడింది. గత 4 నెలల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 72 మంది మావోయిస్టులు మృతిచెందారు.
గత పదేళ్లలో…
2004-2014 దశాబ్దానితో పోల్చుకుంటే 2014-2023 కాలంలో వామపక్ష తీవ్రవాదం(Left-Wing Extremism) 52 శాతం, మరణాలు 69% తగ్గిపోయాయి. ఇలాంటి ఘటనలు అంతకుముందు పదేళ్ల కాలంలో 14,862 జరగ్గా, తర్వాతి పదేళ్లకు వాటి సంఖ్య 7,128 గా రికార్డయ్యాయి. 2004-2014లో 6,035 మంది ప్రాణాలు కోల్పోతే, 2014-2023 కాలంలో మరణాల సంఖ్య 1,868 చేరుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
నక్సల్స్ దాడుల్లో భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు 72% తగ్గిపోగా, అంతకుముందు దశాబ్దంలో 1,750గా ఉన్న మరణాలు 485కి చేరుకున్నాయి. సాధారణ పౌరుల మృతి కేసులు భారీ(68%)గా తగ్గిపోయాయి. అంతకుముందు 4,285 మంది చనిపోతే ఈ పదేళ్లలో ఆ సంఖ్య 1,383కు చేరింది.