జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని(Visit) తరించాలని భావించే అమర్ నాథ్(Amarnath) యాత్ర… భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. 62 రోజుల పాటు అనుమతించే ఈ టూర్ కోసం లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. అమర్ నాథ్ కు రెండు కిలోమీటర్ల దూరంలోని బాల్తాల్ చెక్ పోస్టు… ప్రస్తుతం జనాలతో కిక్కిరిసిపోయింది. మంచు శివలింగం దర్శనానికి భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇవాళ్టి దర్శనం కోసం అర్ధరాత్రి 12:30 గంటల నుంచే క్యూ లైన్లు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అనుమతించే దర్శనాలకు సంబంధించి భక్తులు.. ఉదయం 9 గంటల వరకు బాల్తాల్ క్యాంపు వద్ద క్యూలో ఉండాలి. ఈ క్యూల కోసం గురువారం అర్థరాత్రి నుంచే జనాలు భారీగా బాల్తాల్ చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు.
కిక్కిరిసిన జనంతో అటు భద్రతా సిబ్బంది సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ యాత్ర రెండు జిల్లాల మీదుగా సాగుతుంది. అనంత్ నాగ్ జిల్లా పహల్ గావ్… గండేర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి భక్తుల్ని అనుమతిస్తారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు గుహకు… శ్రావణమాసంలోనే భక్తులకు పర్మిషన్ ఇస్తారు. 13 నుంచి 70 సంవత్సరాల మధ్య గల వ్యక్తుల్ని యాత్రకు అనుమతిస్తుండగా… ఏటా లక్షల సంఖ్యలో దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకుంటారు. పటిష్ఠ బందోబస్తు, పారామిలిటరీ బలగాల పహారాలో యాత్ర సాగుతుంటుంది.