37 ఏళ్ల ఉద్యోగ జీవితం… 57 సార్లు బదిలీ… ఇదీ నిక్కచ్చి గల IAS అధికారి అశోక్ ఖేమ్కా స్టోరీ. 1991 బ్యాచ్ కు చెందిన అశోక్.. రవాణా శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ(ACS) హోదాలో ఈరోజు(ఏప్రిల్ 30) రిటైరయ్యారు. హరియాణా కేడర్ కు చెందిన ఈయన 2024 డిసెంబరులో అంటే 5 నెలల క్రితమే ఈ పోస్టులో చేరారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాకు చెందినవిగా భావించే గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని 2012లో రద్దు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1965 ఏప్రిల్ 30న కలకత్తాలో జన్మించిన ఖేమ్కా.. 1988లో IIT ఖరగ్ పూర్ నుంచి బీటెక్ పట్టా పొందారు.
2023లో ఆయన్ను విజిలెన్స్ శాఖకు పంపారు. దీంతో ఆయన… ‘పనిని పక్కనపెట్టడం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడదు.. నా సర్వీస్ కెరీర్ చివరి కాలంలో, అవినీతిని రూపుమాపడానికి దొరికిన ఇదొక అవకాశం.. అవకాశమిస్తే అవినీతిపై యుద్ధం చేస్తా.. ఎంత ఉన్నతుడైనా, బలవంతుడైనా తప్పించుకోబోరు.. కానీ సరళమైన చెట్లను ఎప్పుడూ ముందుగానే నరికేస్తారు..’ అంటూ చెప్పుకొచ్చారు.