IAS, IPS అధికారుల కేడర్(Cadre) గొడవ వివాదాలమయంగా మారింది. చివరకు సొంత కేడర్లకు వెళ్లాలని కోర్టు ఆదేశాలివ్వడంతో వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లను AP, తెలంగాణ కేడర్లుగా విభజించారు. ఇందుకోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ వేశారు. సివిల్ సర్వీసెస్ లో కేడర్ అనేది ఒక ప్రాంతానికి గుర్తు. శిక్షణ(Training) పూర్తయిన తర్వాత ర్యాంకును బట్టి వారిని DoPT ఏ రాష్ట్రానికి కేటాయిస్తుందో అప్పట్నుంచి ఆ రాష్ట్ర కేడర్ గా పరిగణిస్తారు. IASలకు DoPT… IPSలకు కేంద్ర హోంశాఖ వీటిని కేటాయిస్తుంటాయి.
మూడు రకాలుగా…
ఒకసారి కేడర్ కేటాయిస్తే వాటిని మార్చడం కష్టం. కానీ కొన్ని రిక్వెస్ట్ ల వల్ల మార్చే వీలు కూడా ఉంది. వేర్వేరు కేడర్ల అధికారులు పెళ్లి చేసుకుంటే వారిద్దరూ ఒకే కేడర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక రెండు రాష్ట్రాలు(పని చేస్తున్న, పని చేయబోయే) అనుమతించినా ‘ఇంటర్ కేడర్ డిప్యూటేషన్’కు ఛాన్స్ ఉంటుంది. ఇక అవసరం మేరకు ఒక కేడర్ నుంచి ఇంకో కేడర్ కు మార్చే అధికారం కేంద్రానికి ఉంది. ఇలా మూడు రకాలుగా అధికారుల కేడర్ ను మార్చవచ్చు.
డీవోపీటీ, క్యాట్ అంటే…
UPSC, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(CAT) వంటి విభాగాలకు ఉద్యోగుల్ని అందించేదే DoPT. ఈ DoPT కేటాయింపులను సవాల్ చేసేందుకు CATను తీసుకొచ్చారు. నియామకాలు, బదిలీల్లో సమస్యలు తలెత్తినప్పుడు న్యాయ విభాగమైన CATను ఆశ్రయించొచ్చు. దీనివల్ల ఉద్యోగుల సమస్యలు వేగంగా పరిష్కారమవడంతోపాటు కోర్టులపై భారం తగ్గుతుంది.
హైదరాబాద్ నే…
హైదరాబాద్ పైనే అందరూ మక్కువ చూపడంతో క్యాట్ ను ఆశ్రయించి కొందరు అక్కడే ఉంటున్నారు. 2015లో అమ్రపాలి CATను ఆశ్రయిస్తే DoPT ఆదేశాల్ని కొట్టివేయడంతో ఆమె ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. తాజాగా మరోసారి క్యాట్ ను ఆశ్రయించడం, అక్కడ నిరాశ ఎదురవడంతో తెలంగాణ హైకోర్టుకు చేరింది వ్యవహారం. కానీ ఆ పిటిషన్ను కొట్టివేయడంతో ఇక ఎవరి కేడర్లో వారు చేరిపోవాల్సిందే.