ఆ నలుగురి వల్లే జీ20 సదస్సు.. భారత్ కు అపారమైన గౌరవ ప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టింది. ఆ నలుగురెవరో సుప్రసిద్ధ నాయకులు కాదు.. దేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా సేవలందించిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు. జీ-20 సమ్మిట్ అంటే ఇతర దేశాలకు ఏమో గానీ భారత్ కు మాత్రం అత్యంత ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. తొలిసారి ఈ సదస్సు నిర్వహిస్తుండటం.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా ప్రపంచంలోని అగ్ర దేశాలన్నీ అటెండ్ అయిన ఈ మీటింగ్ ను కనీవినీ ఎరుగని రీతిలో జరపాలన్న ఉద్దేశం ప్రధాని మోదీలో కనపడింది. అందుకే ఏ మాత్రం తక్కువ కాకుండా ఏర్పాట్లు చేయగలిగారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం(Programme) గ్రాండ్ సక్సెస్ కావడంలో నలుగురు ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారుల కృషి ఉంది. వారం రోజుల పాటు కంటికి నిద్ర లేకుండా విధులు నిర్వర్తించిన తీరుతోనే అత్యంత విజయవంతంగా జీ20 సదస్సును కంప్లీట్ చేశారు. ఆ నలుగురే అభయ్ ఠాకూర్, నాగరాజ్ నాయుడు కాకనూర్, ఈనం గంభీర్, ఆశిష్ కుమార్ సిన్హా. ఈ సదస్సుకు షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ ఆధ్వర్యంలో వీరంతా తీవ్రంగా శ్రమించారు. విదేశాంగ విధానంలో అపార అనుభవమున్న ఈ నలుగురి సూచనల వల్లే… దేశాల అధినేతల్ని రిసీవ్ చేసుకోవడం, ఆయా దేశాల సెక్యూరిటీకి అనుగుణంగా బస కల్పించడం, దేశానికి ఎక్కడా చెడ్డపేరు రాకుండా చిన్న, పెద్ద రాజ్యాలు అనే తేడా లేకుండా ఎవరికివ్వాల్సిన ప్రొటోకాల్ వారికి కల్పించడంలో సఫలీకృతమయ్యాం.
ఇంజినీరింగ్ చదివిన అభయ్ ఠాకూర్.. 1992లో IFSకు సెలెక్ట్ అయ్యారు. జీ20 సెక్రటేరియట్ కు అడిషనల్ సెక్రటరీగా నియమితులైన ఈయన.. మాస్కో, లండన్, హో చీ మిన్హ్ లో పనిచేశారు. నైజీరియా, మారిషస్ లో రాయబారిగా పనిచేసి తాను బాధ్యతలు చేపట్టిన ప్రతిచోటా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన వ్యక్తిగా పేరుపొందారు. ఒకానొక దశలో ఈ సీనియర్ ఆఫీసర్.. అమితాబ్ కాంత్ కు రైట్ హ్యాండ్ గా నిలిచారు. జీ20 సెక్రటేరియట్ కు జాయింట్ సెక్రటరీగా ఉన్న నాగరాజ్ నాయుడు.. 1998 IFS బ్యాచ్ కు చెందినవారు. అవినీతి నిరోధక, కల్చర్, డెవలప్మెంట్, డిజిటల్ ఎకానమీ, విద్య, టూరిజం శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. చైనీస్ భాషలో అనర్గళంగా ప్రసంగించే కాకనూర్.. యోగా, ఫిట్నెస్ లో సుప్రసిద్ధులు. USకు చెందిన ఫ్లెచర్ స్కూల్ స్టూడెంట్ అయిన నాగరాజ్ లా అండ్ డిప్లొమసీలో మాస్టర్స్ డిగ్రీ పొందగా.. ఐక్యరాజ్యసమితి(UNO)లో పనిచేశారు.
2005 బ్యాచ్ కు చెందిన ఈనం గంభీర్.. జీ20 సెక్రటేరియట్ కు జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని గట్టిగా నిలదీసి UNOలో ప్రసంగంతో ప్రపంచ దేశాల్ని ఆకట్టుకున్న ఈనం.. అఫ్గానిస్థాన్, ఇరాన్ దేశాల్లో సేవలందించారు. గణితంలో రెండు మాస్టర్ డిగ్రీలు పొందిన ఆమెకు ఇంటర్నేషనల్ సెక్యూరిటీపైనా పూర్తిస్థాయిలో పట్టు ఉంది. స్పానిష్ భాషలో ఎక్స్పర్ట్ అయిన గంభీర్.. హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కవితలు రాశారు. ఇక జీ20 సదస్సుకు మరో జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆశిష్ కుమార్ సిన్హా సైతం 2005 IFS బ్యాచ్ కు చెందిన అధికారి. డిప్లొమాట్ గా 18 ఏళ్ల అనుభవం ఉన్న ఆశిష్.. కెన్యా రాజధాని నైరోబిలో డిప్యూటీ హై కమిషనర్ గా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉంటూ పాకిస్థాన్ భరతం పట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఈనం గంభీర్ మాదిరిగానే స్పానిష్ భాషను అనర్గళంగా మాట్లాడగలరు. ఇలా ఈ నలుగురు ఉన్నతాధికారుల వల్లే జీ20 సమ్మిట్ దిగ్విజయంగా ముగిసింది. తద్వారా భారత్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడంతోపాటు ఎన్నో ఒప్పందాలు, ఒడంబడికలకు వీరి టాలెంటే కారణంగా నిలిచింది.