అందరూ ఎదురుచూస్తున్నట్లుగా ఆదాయ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తూ మంత్రి నిర్మల పార్లమెంటులో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఇదే అత్యంత ప్రధానం కానుంది. రూ.18 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి రూ.70 వేల వరకు లబ్ధి(Benefit) కలగనుండగా, రూ.25 లక్షల వరకు ఇన్ కం పొందేవారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలిగేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు కొత్త పన్ను విధానంలో శ్లాబులను మార్చారు. దీనికి మరో రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12.75 లక్షల వరకు పన్ను ఉండకపోవచ్చు. అయితే ఇది ఎలా ఉండబోతుందన్న విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉందని ఆర్థిక నిపుణులు అంటన్నారు. పాత పన్ను విధానంలో రూ.4 లక్షల వరకు పూర్తి మినహాయింపు(Exemption) ఉంది. సీనియర్ సిటిజన్ల TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది.
కొత్త విధానం…
పన్ను సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల(Tax Payers) సౌలభ్యాన్ని పెంచడం, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇది మేలు చేస్తుందన్న అభిప్రాయం ఉంది. ఫేస్ లెస్ అసెస్మెంట్(Faceless Assesment), టాక్స్ పేయర్ ఛార్టర్, రిటర్న్స్ ను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి అంశాలను మంత్రి ప్రస్తావించారు. దేశంలో 99 శాతం రాబడులు సెల్ఫ్ అసెస్మెంట్ మీదే ఆధారపడి ఉండగా, ఈ విధానాల్ని కేంద్రం పర్యవేక్షించడం ద్వారా చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకం పెరిగేలా కొత్త విధానం ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.