
Published 08 Jan 2024
భారత వింగ్ కమాండర్(Wing Commander) అభినందన్ వర్ధమాన్ ను పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్న తర్వాత అసలేం జరిగింది.. ఈ ఘటనతో భారత్(Bharath) ఎలా స్పందించింది.. పుల్వామా ఉగ్రదాడి ఘటన(Terrorist Attack) తర్వాత ఏం జరిగింది… అందరూ అనుకుంటున్నట్లుగా పాక్ పై అంతర్జాతీయ ఒత్తిడి తేవడమొక్కటే భారత్ లక్ష్యం కాదట. పాక్ పై యుద్ధానికి మోదీ సర్కారు రెడీ అయిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాయాది దేశంపై ఏకంగా తొమ్మిది క్షిపణుల్ని ఎక్కుపెట్టిందట. ఈ విషయాన్ని ప్రధాని సైతం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. కానీ 2019 ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రం ‘అభినందన్ ను విడిచిపెట్టి పాక్ బతికిపోయింది’ అని మోదీ అన్నారు. ఈ విషయాలన్నీ పాక్ లోని అప్పటి భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పంచుకున్నారు.
పుస్తకంలో అనుభవాలు…
భారత్-పాక్ దౌత్య సంబంధాలపై బిసారియా రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాల్ని ఆయన పంచుకున్నారు. వర్ధమాన్ ను పాక్ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన తీరుపై ఆగ్రహంతో ఉన్న మోదీతో.. నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడేందుకు ప్రయత్నించినా మోదీ అంగీకరించలేదట. ఫిబ్రవరి 27న అభినందన్ ను బంధించడాన్ని తీవ్రంగా తీసుకున్న భారత్.. పాక్ పై 9 మిసైల్స్ ని ఎక్కుపెట్టిందట. ఈ విషయం తెలుసుకున్న దాయాది దేశం.. పాక్ హైకమిషనల్ సోహైల్ అహ్మద్ తో రాయబారం నెరిపింది. ఈ పుస్తకం రాసిన బిసారియా(హైకమిషనర్)తో ఫిబ్రవరి 27న మాట్లాడిన సోహైల్.. తమ ప్రధాని మోదీతో మాట్లాడాల్సి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీకి బిసారియా చేరవేయగానే.. ప్రధాని అందుబాటులో లేరన్న రిప్లై వచ్చింది. పాక్ కు అత్యవసరం ఉంటే తనతో మా హైకమిషనర్(బిసారియా)తోనే మాట్లాడాలని చెప్పడంతో.. ఇక పొరుగు దేశం నుంచి జవాబు లేకుండా పోయింది.
దౌత్య నీతితోనే గజగజ…
ఇలాంటి భారత దౌత్య నీతి వల్లే పాక్ ప్రభుత్వం భయపడిందని బిసారియా చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు తనను కలిసినట్లు.. కిర్గిస్థాన్ లో జరిగిన SCO సమ్మిట్ లో ఇద్దరు PMల మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు బిసారియా తెలిపారు. ఉగ్రవాదం గురించి మోదీకి వివరించాలని ఇమ్రాన్ చూసినా ఆ భేటీకి ప్రధాని రాలేదు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికుల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి జవాబుగా భారత్.. బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడికి దిగింది. ఫిబ్రవరి 27న ఎఫ్-16 యుద్ధ విమానంతో పాక్ ఎయిర్ ఫోర్స్… అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానాన్ని కూల్చేసింది. పారాచూట్ ద్వారా కిందకు దూకిన వర్ధమాన్.. పాక్ భూభాగంలో పడటంతో బంధించారు. తదనంతర పరిణామాలతో ఆయన్ను వాఘా బోర్డర్ వద్ద భారత్ కు అప్పగించారు.
నో లీక్…
ఇంత జరిగినా మోదీ సర్కారు నుంచి ఈ అంశంలో ఒక్కటీ ఇప్పటిదాకా బయటకు రాలేదు. ‘అభినందన్ ను విడిచిపెట్టి పాక్ మంచి పని చేసింది… లేదంటే ఆ దేశం భయంకరమైన రాత్రిని గడపాల్సి వచ్చేది’ అని మాత్రమే మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కానీ దీని వెనుక ఇంత తతంగం ఉందన్నది బిసారియా తన పుస్తకంలో రాసే దాకా బయటకు రాలేదు.