Published 19 Dec 2023
రాహుల్ పై మిత్రపక్షాలే అయిష్టతతో ఉన్నాయా…
గాంధీ కుటుంబాన్ని కాదని మరో వ్యక్తికి ప్రధాని పదవా…
కీలక పార్టీలే ఖర్గేకు మద్దతు తెలుపుతున్నాయా… !
ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి అవుననే అనిపిస్తోంది. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి(India National Development Inclusive Alliance)లో ఈ రోజు ఇదే సంచలన వార్త. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణపై దేశ రాజధానిలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కార్యాచరణకు బదులు రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వమే ప్రధాన చర్చకు దారితీసింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును బంగాల్ CM మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీన్ని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్థించారు. అయితే ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన ఖర్గే.. ముందుగా ఎన్నికలకు వెళ్దాం, విజయం సాధిద్దాం అన్న రీతిలో జవాబిచ్చారని MDMK నేత వైకో అన్నారు.
‘ఎన్నికల్లో విజయం సాధించడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం.. ఎవరు ప్రధానమంత్రి అనేది తర్వాత చూసుకుందాం.. ఇక్కడ MPలు లేరు.. MPలు లేని సమయంలో దాని గురించి మాట్లాడి ఏం లాభం.. ముందుగా మనం ఉమ్మడి పోరాటంతో మంచి మెజార్టీ సాధించాలి.. ఆ తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపీలే ఎన్నుకుంటారు’ అని ఖర్గే సమాధానమిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన నాలుగో మీటింగ్ పై కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేస్తూనే కూటమికి కన్వీనర్ ను ఎన్నుకోలేదన్నారు. అయితే ఈ భేటీలో సీట్ల షేరింగ్ పైనే చర్చ సాగించామని, ప్రధాని పదవి గురించి పెద్దగా ఆలోచించలేదని JMM నేత మహువా మజీ తెలిపారు. ఈ మీటింగ్ కు 28 పార్టీల ప్రతినిధులు అటెండ్ కాగా.. జనవరి 1 కల్లా సీట్ల పొత్తులపై నిర్ణయానికి రావాలని అనుకున్నారు. ఇండియా కూటమి తొలి మూడు సమావేశాలు పట్నా, బెంగళూరు, ముంబయిలో జరగ్గా, నాలుగో భేటీని మంగళవారం నిర్వహించారు.
వాస్తవానికి ప్రధాని పదవి కోసం మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి నేతలు రేసులో ఉన్నారు. అలాంటి వారిలో ఇద్దరు ముఖ్యులైన మమతా, కేజ్రీవాలే స్వయంగా ఖర్గేను ప్రతిపాదించడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ పరిణామాల్ని బట్టి గాంధీ కుటుంబయేతర వ్యక్తికే పట్టం కడతారా అన్నది చర్చనీయాంశమైంది. మొత్తానికి భావి భారత ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీపై కూటమి పక్షాల్లోనే వ్యతిరేకత ఉందని దీన్ని బట్టి అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు.. మిత్రపక్షాల ప్రతిపాదన మింగుడుపడనిదిగా తయారైందని చెప్పవచ్చు. మరి రాహుల్ ను కాదని ఖర్గేకు ఇదే సపోర్ట్ కంటిన్యూ అవుతుందా.. ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తారా అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంది.