తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) అంతర్గత వ్యవహారమని, తమ సంస్కృతుల్ని కాపాడుకోవాల్సిన అవసరముందని భారత్ స్పష్టం చేసింది. CAA అమలుపై కన్నేశామని, అది ఎలా ఉంటుందో చూస్తామని అమెరికా చెప్పడంపై భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. భిన్న సంస్కృతులు, లౌకిక వాదం కలిగిన దేశంలో కాందిశీకులకు ఆశ్రయమివ్వడం తప్పు కాదు కదా అంటూ అగ్రరాజ్యానికి తెలియజేసింది. ‘తప్పుదారి పట్టడం’, ‘తప్పుడు సమాచారం’, ‘సమంజసం కాని’ వంటి పదాలు వాడిన అమెరికా విదేశాంగశాఖ కామెంట్స్ పై భారత్ తీవ్రంగా స్పందించింది.
అసలు కోణం చూడాలి…
‘దేశంలో అన్ని మతాలకు రాజ్యాంగం సరైన గౌరవం కల్పించింది.. మైనారిటీల విషయంలో తమకు ఎలాంటి రెండో ఆలోచన లేదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తీసుకున్న ఒక అద్భుతమైన చొరవను ఓటు బ్యాంకు రాజకీయాల్లా చూడకూడదు.. అనుచిత సలహాలు ఇచ్చేముందు భారత్ లో అనాదిగా వస్తున్న భిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవాలి.. భారతదేశం తీసుకున్న నిర్ణయంలోని కోణాన్ని శ్రేయోభిలాషులు, భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకోవాలి’… అంటూ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దీర్ఘకాల కమిట్మెంట్స్ తో…
అంతర్గత సంస్కృతులు, మానవ హక్కులపై భారత్ కున్న కమిట్మెంట్స్ వల్లే.. పాక్, బంగ్లా, అఫ్గాన్ దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు ఆశ్రయమిచ్చేందుకే CAAను తీసుకువచ్చామని రణధీర్ స్పష్టం చేశారు.