పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు సిరా(Ink) చల్లారు. తన ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ ఒవైసీయే ట్వీట్ ద్వారా బయటపెట్టారు. జై పాలస్తీనా అంటూ నినాదాలు(Slogans) ఇచ్చిన ఒవైసీ తీరుపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని ఆయన నివాసంపై ఇంక్ చల్లారు.
ఒవైసీ ఇంటిపై అంటించిన పోస్టర్లలో ఇజ్రాయెల్ అనుకూల నినాదాలున్నాయి. ఇంత జరిగినా ఢిల్లీ పోలీసులు కనీసం పట్టించుకోలేదని, ఇదంతా హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసి MPలకు రక్షణ ఉందా లేదా అని అడిగారు. ఇద్దరు వ్యక్తులు సావర్కర్ తరహాలో మా ఇంటిపై ఇంకు చల్లి రాళ్లు విసిరారన్న ఒవైసీ.. అలాంటి వాటికి భయపడేది లేదన్నారు.