లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం మరోసారి చర్చకు దారితీసింది. ఇలా దేశంలో పలువురు ముఖ్యమంత్రులు పదవిలో ఉండగానే అరెస్టు కాగా, మరికొందరు మాజీలుగా జైలు పాలయ్యారు. అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చారు. ఇందులో అత్యధికులు సీనియర్ నాయకులు, ఎక్కువ కాలం సీఎంలుగా పనిచేసినవారు కావడం విశేషం. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున అరెస్టయ్యారు.
తమిళనాట…
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు CMగా ఉన్న జయలలిత.. కుర్చీలో ఉన్న టైంలోనే అరెస్టయ్యారు. 14 సంవత్సరాల పాటు ఆరు దఫాలు CMగా పనిచేసిన ఆమెకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు రూ.100 కోట్ల ఫైన్ వేసింది. ఇక రాజకీయ కురువృద్ధుడిగా పేరుపడ్డ కరుణానిధి సైతం.. ఓ కేసులో అరెస్టయినా నేరం నిరూపణ కాలేదు. చెన్నైలోని ఫ్లై ఓవర్ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనేది అభియోగం.
జార్ఖండ్ లో ఇద్దరు…
బొగ్గు కుంభకోణం(Scam)లో జార్ఖండ్ CM మధుకోడా ఊచలు లెక్కబెట్టారు. ఆ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రిగా పనిచేసిన మధుకోడాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద కేసు ఫైల్ అయింది. UPA అలయెన్స్ లో 2006 నుంచి 2008 వరకు CMగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచి CMగా పనిచేసిన మూడో వ్యక్తి ఆయన. 1971లో ఒడిశాలో విశ్వనాథ్ దాస్, 2002లో మేఘాలయలో ఫ్లిండర్ అండర్సన్ ఖోంగ్లాంగ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానా కోడాకు పడింది. ఇక జార్ఖండ్ సీఎంగా పనిచేసిన శిబూ సోరెన్.. తన పర్సనల్ సెక్రటరీ సత్యనాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో అరెస్టు కాగా.. ఆయన నిర్దోషి అని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.
ఉప ప్రధాని తనయుడు…
హర్యానా మాజీ CM ఓం ప్రకాశ్ చౌతాలా జైలుకు వెళ్లారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ తనయుడు చౌతాలా.. 4 సార్లు CMగా పనిచేసి తొమ్మిదిన్నరేళ్లపాటు తీహార్ జైలు శిక్ష అనుభవించారు. 1999-2000 కాలంలో 3,206 జూనియర్ బేసిక్ టీచర్స్ రిక్రూట్ మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ చౌతాలతోపాటు మరో 53 మందిని న్యూఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.
అత్యంత చిన్న వయసు(29)లో లోక్ సభ మెంబర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్.. ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. బిహార్ కు చెందిన ఈయనకు దాణా కుంభకోణంలో రాంచీలోని CBI ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.60 లక్షల ఫైన్ వేసింది.
మధుకోడా మాదిరిగానే మైనింగ్ స్కాంకు సంబంధించిన కేసులో BJP సీనియర్ లీడర్, కర్ణాటక మాజీ CM యడ్యూరప్ప జైలు జీవితాన్ని అనుభవించారు. ఈయన 2 సార్లు సీఎంగా పనిచేశారు.
ఉత్తర్ ప్రదేశ్ కు 2 సార్లు CMగా చేసిన చరణ్ సింగ్ సైతం.. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయ్యారు. 1995-2004 వరకు ఉమ్మడి APకి 2014-2019 వరకు విభాజ్య ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. కొద్దికాలం క్రితం రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఉమ్మడి APలో అత్యధిక కాల CM రికార్డు బాబు పేరిట ఉండగా.. స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో కోర్టు రిమాండ్ విధించింది.