
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరకు చేరువైంది. ల్యాండర్ మాడ్యుల్ కక్ష్యను తగ్గించేందుకు నిర్వహించిన సెకండ్ డీ-బూస్టింగ్ సక్సెస్ అయింది. అటు భారత్ కు దీటుగా మనకన్నా ముందుగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాలన్న అత్యుత్సాహాన్ని చూపించిన రష్యా.. చివరి దశలో చతికిలపడింది. ఇండియా చేపట్టిన విన్యాసం సక్సెస్ కాగా… రష్యా విన్యాసం విఫలమైంది. ఆ దేశం ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ లో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో అది చంద్రుడిపై కుప్పకూలిపోయింది. ఇక చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై అడుగుపెడితే మాత్రం… ఆ రికార్డ్ సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఇక కుప్పకూలిన లూనా-25 ల్యాండర్ లో ప్రాబ్లమ్ ను గుర్తించే పనిలో ఉన్నామని రష్యన్ స్పేస్ ఏజెన్సీ అయిన ‘రోస్ కాస్మోస్’ ప్రకటించింది. చందమామ కక్ష్యలో తిరుగుతున్న వ్యోమనౌక లూనా-25.. కీలక విన్యాసాన్ని చేపట్టే సమయంలో ఆ నౌక ఆటోమేటిక్ స్టేషన్ లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఏర్పడింది. దీంతో తాను చేపట్టాల్సిన విన్యాసం సరిగా జరగకుండా అక్కడే కుప్పకూలిపోయింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రయోగానికి ముందుకొచ్చిన రష్యా.. తమ ల్యాండర్ ఫెయిలైనట్లు ప్రకటించింది.
కానీ ఈసారి పక్కా ప్లానింగ్ తో వెళ్లిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గానే టూర్ కొనసాగిస్తోంది. ఈనెల 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ISRO ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ల్యాండింగ్ ప్రక్రియను లైవ్ టెలికాస్ట్(Live Telecast) చేయాలని దేశంలోని విద్యాసంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కలకాలం గుర్తుండిపోయేలా, యువత మనసుల్లో రోదసీపై ఇంట్రెస్టింగ్ పెంచేలా ప్రత్యక్ష ప్రసారం ఉపయోగపడుతుందని తెలిపింది. దేనికైనా ఎగిరెగిరి పడకూడదని అంటారు. రష్యా మేథస్సును ఏ మాత్రం శంకించే అవకాశం లేకున్నా.. భారత్ కన్నా వెనుకగా యాత్రను స్టార్ట్ చేసి చంద్రయాన్-3 కన్నా ముందుగా కాలు మోపి క్రెడిట్ ను తాను దక్కించుకోవాలని చూసింది. కానీ ఏమైంది… అసలైన సమయంలో అవరోధాలు ఎదుర్కొంది. దీన్నిబట్టి అర్థమైందేంటంటే.. ఆరాటం కాదు పోరాటం ఉంటేనే ఎందులోనైనా పైచేయి అని.