‘భాష మతం కాదు.. అది మతాన్ని సూచించదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ‘ఒకరికి తెలియకపోయినా, ప్రజలు ఉపయోగించే భాష ఉర్దూతో నిండి ఉంది.. ఉర్దూ పదాలు వాడకుండా హిందీలో రోజువారీ సంభాషణ చేయలేమని చెప్పడం తప్పు కాదు.. హిందీ అనే పదం హిందవి అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది.. రెండు భాషలను మతం ఆధారంగా విభజించడంలో వలస రాజ్యాలు చేసిన దోపిడీకి నిదర్శనం.. ఉర్దూతో పరిచయం కలిగి ఉంటే అధికార భాషతోపాటు మరాఠీని ఉపయోగించడంలో తప్పులేదు.. విభిన్న అభిప్రాయాలు, నమ్మకాలు కలిగిన వ్యక్తులను ఒక్కచోటకు చేర్చే ఆలోచనల మార్పిడికి భాష సాధనం.. అది సమాజ విభజనకు దారితీయకూడదు.. మన అపోహలు, బహుశా ఒక భాష పట్ల మనకున్న పక్షపాతాలను వీడాలి..’ అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ బెంచ్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర అకోలా జిల్లాలోని పాటూర్ మాజీ కౌన్సిలర్ వర్షతై సంజయ్ బగాడే దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కౌన్సిల్ నేమ్ బోర్డుపై మరాఠీ మాత్రమే వాడాలని, ఉర్దూను అనుమతించరాదంటూ పిటిషన్ వేశారు. అంతకుముందు ఆమె బాంబే హైకోర్టులోనూ పిటిషన్ వేయగా అక్కడా తిరస్కరణకు గురైంది.