‘మీతో బంధానికి పదేళ్లు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. 140 కోట్ల మంది నమ్మకం(Trust), మద్దతే(Support) తనకు స్ఫూర్తి అని, అనుక్షణం అవే తనను నడిపిస్తున్నాయని గుర్తు చేశారు. గత పదేళ్ల పాలనా కాలంలో ప్రజల్లో వచ్చిన పరివర్తన(Tranformation) తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని అన్నారు. ఇలాంటి నిబద్ధతతో కూడిన పరిపాలనా ఫలాలు రానున్న రోజుల్లో అందరికీ అందుతాయని… పేదలు, రైతులు, యువత, మహిళల జీవితాల్లో మార్పులకు నాంది పలుకుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్కీమ్ లను ప్రస్తావిస్తూ…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లు.. విద్యుత్తు, నీరు, LPG… ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఉచిత వైద్య సేవలు(Free Medical Treatment).. రైతులకు ఆర్థిక చేయూత.. మాతృ వందన యోజన కింద మహిళలకు సాయం వంటి స్కీమ్ లు అమలు కావడానికి మీ గుండెల్లో తమకు స్థానం కల్పించడం వల్లేనని గుర్తు చేశారు. సంప్రదాయం, ఆధునికత(Modernity) మేళవింపుగా చేతులు మారుతున్న భారత సంస్కృతి.. భవిష్యత్ తరాలకు గొప్ప ముందడుగు కాగలదన్నారు.
మీరిచ్చిన స్ఫూర్తితోనే…
140 కోట్ల హృదయాలతో ఇచ్చిన స్ఫూర్తితోనే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని మోదీ గుర్తు చేశారు. GST అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, నారీ శక్తి వందన్ నిర్ణయాలకు తోడు ఉగ్రవాదం, అతివాద ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటు నూతన బిల్డింగ్ ద్వారా అడుగులు పడ్డాయన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ‘వికసిత్ భారత్’ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ప్రజా సంక్షేమం మరింత ఉన్నతంగా ఎదగాలంటే మీ మద్దతు ఇంకా అవసరం అంటూ మోదీ ముగించారు.