ఎలక్షన్లప్పుడు ప్రకటించే ఫ్రీ స్కీమ్స్ వల్ల ప్రజలపై ఎలా భారం పడుతుందో మెల్లమెల్లగా తెలిసివస్తుంది. ముందు ఇచ్చుడు… తర్వాత బాదుడు అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకను చూస్తే అదే సీన్ కనిపిస్తోంది. మొన్న జరిగిన ఎలక్షన్లలో పెద్దయెత్తున ఉచిత పథకాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. లిక్కర్ పై ఎడాపెడా రేట్లు పెంచుతూ సర్కారుకు ఆదాయం వచ్చేలా టార్గెట్లు పెడుతోంది. ప్రస్తుత కన్నడనాట రేట్స్ చూస్తే దేశంలోనే అత్యధికంగా వసూలు చేస్తున్న రాష్ట్రమిదే. లిక్కర్ అమ్మకాల్లో దేశంలో ‘మోస్ట్ ఎక్స్ పెన్సివ్’ స్టేట్ గా నిలుస్తోంది.
మొన్నీమధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచాక సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరింది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ(AED) పేరుతో 20 శాతం రేట్లు పెంచాలని గత శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రతిపాదించారు. సభ ఆమోదిస్తే ఈ నెల 19 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ రకం బ్రాండ్లు సైతం అక్కడ చుక్కలు చూపిస్తున్నాయి. లిక్కర్ కొనేవాళ్లల్లో 78 శాతం తక్కువ బ్రాండే తీసుకుంటారని, కేవలం 5 శాతం మంది మాత్రమే టాప్ బ్రాండ్స్ వాడతారని అక్కడి ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఇక బీర్ల రేట్లకొస్తే దేశంలో మూడో స్థానంలో ఉంది కర్ణాటక. పెంచిన రేట్లతో అక్కడ 650ml బీర్ రూ.187కు చేరుకుంది. ఇది తమిళనాడులో రూ.210 కాగా… దిల్లీలో రూ.190గా ఉంది. కర్ణాటక రేట్ల ఎఫెక్ట్ తెలంగాణపై పడే అవకాశముంది. ఇక్కడి సరకు అక్కడకు అక్రమంగా రవాణా అయ్యే ప్రభావముంటుంది. గత కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ బార్డర్స్ నుంచి ఏపీకి భారీగా ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ అయింది. ఇదే పరిస్థితి ఇప్పుడు కర్ణాటకలోనూ జరిగే అవకాశం ఉంది. తద్వారా ముఖ్యమైన బ్రాండ్లకు సంబంధించిన ఐటెమ్స్ తెలంగాణలో తగ్గిపోయే ప్రమాదముంది.