Published 30 Dec 2023
ప్రభుత్వం అందించే సబ్సిడీ గ్యాస్ దక్కుతుందో లేదోనన్న భయంతో LPG డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుల వద్ద జనం బారులు తీరుతున్నారు. డిసెంబరు 31 లోపు ఇ-కేవైసీ(e-KYC) పూర్తి చేయకపోతే రూ.500 సిలిండర్ రాదన్న ప్రచారంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో తమ కేవైసీ పూర్తి చేయాలంటూ వేలాదిగా జనం డిస్ట్రిబ్యూటర్ల వద్దకు చేరుకుంటున్నారు. కానీ ఇకనుంచి అలా చేయవద్దంటూ డిస్ట్రిబ్యూటర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సర్కారు అందించే రూ.500 LPG స్కీమ్ ను పొందేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. ఈ-కేవైసీ కోసం డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూడటం సరికాదని, అసలు డిసెంబరు 31 గడువు లేనే లేదని అంటున్నారు.
వారి మాటల్లోనే…
డిస్ట్రిబ్యూటర్ల మాటల్లోనే చూస్తే… ‘ఈ నెల 31 నాటికి ఇ-కేవైసీ చేసుకోకుంటే LPG రాదన్న అనుమానంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు మా దగ్గరకు వస్తున్నారు.. రోజంతా నిలబడి ఉంటున్నారు.. రాష్ట్ర స్కీమ్ కు సంబంధించిన విధివిధానాలు(Guidelines) మాకు అందలేదు.. కస్టమర్ల ఇంటి వద్దనే ఇ-కేవైసీ పూర్తి చేయాలని చమురు కంపెనీల ప్రతినిధులమైన మాకు కేంద్రం చెప్పింది.. అందువల్ల ఎవరూ భయాందోళన చెందొద్దని చెబుతున్నాం.. డిస్ట్రిబ్యూటరీల వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించొద్దు.. మా డెలివరీ బాయ్ సిలిండర్ ఇచ్చేందుకు మీ ఇంటికి వచ్చినపుడు ఇ-కేవైసీని పూర్తి చేయాలని మేం చెబుతున్నాం.. ఇళ్ల వద్ద ఇ-కేవైసీ చేసేటప్పుడు సమస్యలు ఎదురైతే తప్ప ఎవరూ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు రావొద్దని కోరుతున్నాం’ అంటూ తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.