మహాకుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్(Prayagraj) త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)లో పలువురు మృతి చెందగా, ఆ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని కుంభమేళా DIG వైభవ్ కృష్ణ తెలిపారు. ఇందులో 25 మందిని గుర్తించగా, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అర్థరాత్రి 1-2 గంటల మధ్య తొక్కిసలాట జరగ్గా, అందులో ఇంకో 60 మంది గాయాల పాలయ్యారు. మౌని అమావాస్య దృష్ట్యా అమృత స్నానాల కోసం కోట్లాది మంది వస్తారని అంచనా వేసినందున ఈరోజు VIPలు ఎవర్నీ అనుమతించలేదని స్పష్టం చేశారు. మృతుల్లో కర్ణాటకకు చెందినవారు అత్యధికంగా నలుగురు.. అసోం, గుజరాత్ కు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు నిర్ధారించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 5 కోట్ల 70 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది.