రైలులో మంటలు వస్తున్నాయన్న ప్రచారంతో అందులోని ప్రయాణికులంతా కిందికి దిగారు. కానీ అంతలోపే పక్క పట్టాలపై మరో రైలు రావడంతో దాని కింద పడి తొలుత ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరో ఇద్దరు మృతిచెందగా 40 మందికి గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమం(Condition Serious)గా ఉండగా.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా స్టేషన్ సమీపంలో జరిగింది. లఖ్నవూ నుంచి ముంబయి మధ్య రోజూ తిరిగే పుష్పక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో మంటలు వచ్చాయని వదంతులు(Rumours) వ్యాపించాయి. దీంతో కొంతమంది చైన్ లాగితే మిగతా బోగీల్లోని ప్రయాణికులు వెంటనే ట్రెయిన్ దిగారు. పక్కనున్న ట్రాక్ ను దాటబోయే సమయంలో అప్పుడే వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారంతా హాహాకారాలు చేశారు. ఎనిమిది అంబులెన్సుల ద్వారా బాధితులతోపాటు మృతదేహాలను తరలించారు. ఒక కోచ్ లో బ్రేక్ జామ్ అయి చిన్నగా నిప్పు రవ్వలు(Sparks) రావడంతో అందులోని వారంతా భయపడి(Panicked) చైన్ లాగినట్లు ప్రాథమిక సమాచారం కాగా ఈ ఘటన ముంబయికి 400 కిలోమీటర్ల దూరంలో జరిగింది.