10 రోజులుగా ఎడతెగని విధంగా తయారైన మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తొలుత ఔనని, తర్వాత కాదని జరిగిన ప్రచారానికి తెరదించుతూ అందరూ ఊహించినట్లుగానే దేవేంద్ర ఫడ్నవీస్ కే హైకమాండ్ మొగ్గుచూపింది. ఏక్ నాథ్ షిండేకే పగ్గాలు కట్టబెట్టాలంటూ శివసేన నుంచి డిమాండ్లు రావడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే BJP-శివసేన-NCP అలయెన్స్ లో కమలం పార్టీకి భారీగా సీట్లు రావడంతో ఇక నెక్స్ట్ CM ఫడ్నవీసేనని ముందునుంచీ అనుకుంటున్నారు. కానీ మధ్యలో మరోపేరు తెరపైకి రావడంతో అంతటా అనుమానాలేర్పడ్డాయి.
కానీ ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీనియర్ నేత విజయ్ రూపాని సమక్షంలో సమావేశమైన BJLPలో ఫడ్నవీస్ పేరును ప్రకటించారు. దీంతో రేపు ఆయన ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఏక్ నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ కు డిప్యూటీ CM ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని స్వయంగా శ్రీకాంత్ షిండేనే ప్రకటించారు. ఫడ్నవీస్ CM కానున్న దృష్ట్యా శివసేన-NCPలకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయా అన్న చర్చ మళ్లీ మొదలైంది.