చిన్న పిల్లల(Children)ను ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లోకి తీసుకురావొద్దని వారం క్రితమే ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ ఆదేశాల్ని ఏ మాత్రం పట్టించుకోలేదో శాసనసభ్యుడు. పైగా మీ తల్లిదండ్రులు తనకు ఓటు వేయకపోతే ఉపవాసం ఉండండి అంటూ హితబోధ చేశారు. దీంతో అంశం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా అక్కడి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
పట్టుబట్టి ఒప్పించండి…
హింగోలి ప్రాంతంలోని స్కూల్ విద్యార్థులతో సమావేశమైన శివసేన MLA సంతోష్ బంగర్.. వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘మీ తల్లిదండ్రులు తనకే ఓటేయాలని మీరు చెప్పండి.. వారు ఓటు వేయకపోతే రెండు రోజులు తిండి మానేయండి.. అలా చేస్తే మీ తల్లిదండ్రులు దారికివస్తారు.. అప్పుడు ఓట్లన్నీ నాకే పడతాయి’.. అంటూ మాట్లాడిన వీడియోలు మహారాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎలక్షన్లలో ఎవరికి ఓటు వేస్తున్నారంటూ వారి తల్లిదండ్రుల(Parents) ఎదుటే చిన్నారులను పదే పదే ప్రస్తావించారు.
బాలకార్మిక చట్టం ప్రకారం…
చిన్న పిల్లల్ని ఎన్నికల అంశాల్లోకి లాగొద్దంటూ ఈ నెల 5న EC ప్రత్యేక ఆర్డర్స్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు దీనిపై తీవ్రంగా దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. అయినా ఈ ఎమ్మెల్యే నోరు జారడం మానుకోలేదు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ఎమ్మెల్యే సంతోష్ బంగర్ కు ఓటు వేయాలని మీ తల్లిదండ్రుల్ని అడగండి.. మీ మాట వినకపోతే రెండ్రోజులు ఉపవాసం ఉండండి.. మీ అమ్మానాన్న అడుగుతారు ఎందుకు తినడం లేదని.. అప్పుడు మీరు చెప్పండి సంతోష్ బంగర్ కు మాత్రమే ఓటేయాలని.. తనకే ఓటు వేస్తామని చెప్పాకే భోజనం చేయండి’.. అంటూ మాట్లాడటం వివాదానికి కారణమవుతున్నది.
చర్యలకు డిమాండ్…
ఈయన మరాఠ్వాడాలోని కాలమ్నూరి నుంచి MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కామెంట్స్ పై అక్కడి విపక్షమైన మహా వికాస్ అఘాడీ.. షిండే నేతృత్వంలోని శివసేనపై దుమ్మెత్తిపోసింది. 1986 బాల కార్మిక చట్టం ప్రకారం బంగర్ పై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మిత్రపక్ష BJPతోపాటు మరో ప్రతిపక్ష పార్టీ అయిన NCP సైతం సదరు MLAపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ఇదే MLA.. మోదీ మరోసారి ప్రధాని కావడంపై నోరుజారారు.
Published 11 Feb 2024