అల్లర్లలో 100 మంది మృతి… 300 మందికి గాయాలు…
రిహాబిలిటేషన్ సెంటర్స్ లో 50,000 మంది…
5 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్… 10,000 ప్రత్యేక బలగాలు…

భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో భిన్న లక్షణాలు ఉండే మణిపూర్ లో ట్రైబల్, నాన్ ట్రైబల్ వివాదం నడుస్తోంది. సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియాగా భావించే స్టేట్లలో ఒకటైన మణిపూర్… అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలో నాలుగు తెగలు మైతీ, కుకీ, నాగా, కుకీ ఫంగల్ జాతులున్నాయి. మెజార్టీలైన మైతీలు హిందూ, ముస్లిం, బౌద్థ మతాల్లో ఉండగా… వీరి జనాభా 53 శాతం. 2,000 ఏళ్లుగా వీరు ఇక్కడే ఉంటున్నారు. కుకీ, నాగా ప్రజలు STలు కాగా వీరి జనాభా 40 శాతం, అత్యధికులు క్రిస్టియన్స్. లోయలోని మైదాన ప్రాంతంలో మైతీలు ఉండగా… కొండ ప్రాంతాల్లో కుకీ, నాగా జాతులుంటున్నాయి. మొత్తం 60 అసెంబ్లీ సీట్లలో 19 సీట్లు STలవే. మిగతా 40 సీట్లు అన్ రిజర్వ్ డ్ కోటావి. అసెంబ్లీలో 30 మంది దాకా ఎమ్మెల్యేలు మైతీలే కావడంతో.. చట్టాల విషయంలో వీరిదే డామినేషన్ అని STల వాదన. మరోవైపు తమకూ ట్రైబల్ స్టేటస్ కావాలంటూ మైతీలు గుర్రుగా ఉన్నారు. STలుగా గుర్తించాలంటూ మైతీలు కేసు వేయడం… కేంద్రాన్ని హైకోర్టు వివరణ కోరడంతో మే 3 నుంచి అల్లర్లు మొదలయ్యాయి.

ఒకే రాష్ట్రంలో ఏరియాలను బట్టి డిఫరెంట్ యాక్ట్స్ ఉండటమే మణిపూర్ ఆందోళనకు కారణమంటున్నారు నిపుణులు. SC, ST చట్టాలు స్టార్ట్ అయ్యాకే మణిపూర్లో అల్లర్లని అంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కుకీ, నాగాల్ని ST లిస్టులో చేర్చగా… వారికి రక్షణగా ఆర్టికల్ 371cని రాజ్యాంగం లో చేర్చారు. అది కశ్మీర్ తరహాలో ఆర్టికల్ 370కి దగ్గర్లో ఉంటుంది. దీని ప్రకారం కొండ ప్రాంతాల్లో స్థలాలను బయటివాళ్లు కొనడానికి వీల్లేదు. ఈ అడవుల్లో కుకీలు, నాగాలు ఉండొచ్చు కానీ భూముల్ని అమ్మరాదు, వేరేవాళ్లు కొనరాదు. కానీ అదే లోయలోని మైదాన ప్రాంతాల్లో ఎవరైనా స్థలాలు కొనొచ్చు, అమ్మవచ్చు. ఇంఫాల్ వ్యాలీతోపాటు పట్టణాల్లోని మైతీ గ్రూపులు ఎప్పట్నుంచో స్పెషల్ ట్రైబ్స్ ప్రివిలేజెస్ కోసం డిమాండ్స్ చేస్తూ, కోర్టుల్లో కేసులు వేశాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో టాప్ పొజిషన్లో ఉన్న మైతీలను STల్లో ఎలా చేరుస్తారని, అలా చేస్తే తమ హక్కుల్ని కాలరాసినట్టేనని కుకీలు అంటున్నారు. ST హక్కుల రక్షణకు జిల్లా మండళ్లు, హిల్ ఏరియా కమిటీలు ఉన్నాయి. తమకు చెప్పకుండా అటవీ భూముల్ని రక్షిత, రిజర్వ్ ఏరియాలుగా ప్రకటించరాదని పర్వత ప్రాంత కమిటీలు తీర్మానం చేశాయి.
రిజర్వ్ ఫారెస్టు నుంచి అక్రమ వలసదారుల్ని పంపించే చర్యలను మణిపూర్ సర్కారు చేపట్టింది. వీరంతా మయన్మార్ దేశస్థులు కాగా 1970 నుంచి ఇక్కడే ఉంటున్నారని, ఇంకా వస్తూనే ఉన్నారంటూ బీజేపీ సర్కారు 2023 ఫిబ్రవరిలో చురచంద్ పూర్, తెంగ్ నౌపాల్, కాంగ్ పోక్టి జిల్లాలో చర్యలకు దిగింది. దీన్ని
గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంఫాల్ లోని పర్వత ప్రాంతాల్లో ఇళ్లు, చర్చిలను అధికారులు మిడ్ నైట్ కూల్చివేశారని… రూల్స్ పాటించలేదంటూ STలు ఫైర్ అవుతున్నారు. సీఎం బీరేన్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అక్కడి విపక్షాలతో అమిత్ షా మీటింగ్ పెట్టినా ఫలితం లేదు.ఇలా రెండు అంశాలతో మణిపూర్ రగిలిపోతూనే ఉంది. ఎస్టీ, నాన్ ఎస్టీ అల్లర్లను లోకల్ లీడర్లు మరింత రెచ్చగొడుతున్నారు.